నిరంతర ప్రజా ఉద్యమాలతో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

నిరంతర ప్రజా ఉద్యమాలతో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే ప్రజలు ఘోరంగా విసుగుచెందారని చెబుతూ  “లాఠోంకే భూత్ బాతోం సే నహీ మాంతే” అన్న సామెత చందంగా నిరంతర ప్రజా ఉద్యమాల ద్వారానే ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సి ఉంటుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపిచ్చారు. 
 
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ మల్కాజ్ గిరి జిల్లా ప్రస్తుతం బిజెపికి ఒక తిరుగులేని కంచుకోటగా మారిందని, పాత, కొత్త కార్యకర్తల సమన్వయంతో, ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇక్కడ ఎంపీ స్థానాన్ని, పలు కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్ మహానగరాన్ని మూడు భాగాలుగా విభజించిన నేపథ్యంలో, మల్కాజిగిరి అత్యంత కీలకమైన కార్పొరేషన్‌గా ఎదిగిందని ఆయన తెలిపారు. 
 
అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా, నేటికీ రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంశాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, న్యాయ శాఖ మంత్రి లేకపోవడం అత్యంత దారుణమైన, అసమర్థ పరిపాలనకు నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రే ఈ మూడు కీలక శాఖలను తన వద్ద ఉంచుకొని, శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. 
 
గత జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో “ముస్లిమ్ ఈజ్ కాంగ్రెస్… కాంగ్రెస్ ఈజ్ ముస్లిం” అంటూ మతపరమైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం పొందిందని, ఆ అండతోనే నగరంలో ఎంఐఎం పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘హైడ్రా’ సంస్థ పేదవాడి ఇళ్లను కూల్చివేస్తూ డ్రామాలు ఆడుతోందని, కానీ ఓవైసీకి చెందిన అక్రమంగా నిర్మించినటువంటి ఫాతిమా కాలేజీ వంటి వాటిని మాత్రం ముట్టుకునే ధైర్యం చేయడం లేదని దుయ్యబట్టారు.
హిట్లర్ వినాశనకర ఆలోచనల నుంచే ఈ హైడ్రా పుట్టిందని రేవంత్ చెప్పిన మాటలను గుర్తుచేస్తూ అందుకే “వినాశకాలే విపరీత బుద్ధి” అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.  ఏ అధికారిక హక్కుతో పాఠశాలల్లో ఇతర మతాల పిల్లలకు ఫత్వాలు జారీ చేస్తూ, కల్మాలు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారని రాంచందర్ రావు నిలదీశారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి నేటికీ వెయ్యి రూపాయలు కూడా విదిల్చలేదని ఆరోపించారు.  బీఆర్ఎస్ దోపిడీకి, కాంగ్రెస్ లూటీకి విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీ శ్రేణులంతా ప్రజల పక్షాన నిలబడి ఉధృత పోరాటాలు చేయాలని  రాంచందర్ రావు పిలుపునిచ్చారు.