పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు

పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు

* గదిలోకి లాక్కెళ్లి, మెడపై కత్తి పెట్టి ప్రైవేటు వీడియోలు రికార్డ్

దేశంలోని అత్యున్నత పోలీసు శిక్షణా సంస్థగా పేరొందిన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.  తనతోపాటు శిక్షణ పొందుతున్న తోటి ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్‌ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని, వాట్సాప్‌ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఓ ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 
ఉదయ్‌ కృష్ణారెడ్డి రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్‌ వీడియోలను చిత్రీకరించి తీవ్రంగా బెదిరిస్తున్నాడని, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతోపాటు వాటిని సోషల్‌ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు కొంతకాలంగా తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు.  తన అనుమతి లేకుండా తన పర్సనల్ వీడియోలు చిత్రీకరించి వాటితో బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆమె ఆరోపించారు. 
 
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం ఈనెల 9వ తేదీన నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మెడపై కత్తి పెట్టి బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తన ప్రైవేట్ వీడియోలు రికార్డు చేసి, సెల్ ఫోన్‌ను తీసుకుని ఆ వీడియోలను తన భర్తకు వాట్సాప్ ద్వారా పంపించాడని ఆరోపించింది. ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు. 
 
ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని, మహిళా అధికారి వాంగ్మూలం తీసుకుని, తగిన చర్యలు చేపడతామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో ప్రస్తుతం 2024 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది. ఈ శిక్షణ పొందుతున్నవారిలో ఏపీకి చెందిన ఉదయకృష్ణారెడ్డి గతనెల 23వ తేదీ నుంచి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కర్ణాటకలోని హల్లిమైసూర్‌ ప్రాంతానికి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తనకు వాట్సా్‌పలో అసభ్య సందేశాలు పంపుతున్నారని, శిక్షణలోని ఇతర ఐపీఎస్‌ల ముందు అభ్యంతరకరంగా నిందించారని ఆరోపించారు. అంతేగాకుండా తనకు అకాడమీలోనే మరొకరితో అతిచనువు ఉందని ప్రచారం చేశారని, ఆ విషయాన్ని అందరి ముందు అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి తాను అంగీకరించలేదని.. దీనితో ఉదయకృష్ణారెడ్డి ఈ నెల 8న తన ఫోన్‌ లాక్కుని, గదిలోకి తీసుకెళ్లారని, ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పాలని వేధించారని, అసభ్యంగా తాకుతూ అభ్యంతరకర చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 
 
ఈ నెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తనను బలవంతంగా ఉదయకృష్ణారెడ్డి గదికి తీసుకెళ్లారని, తన జుట్టు పట్టుకుని, గొంతునొక్కారని, గొంతుపై కత్తిపెట్టి బెదిరించారని, తనపై కండోమ్‌ ప్యాకెట్లు విసిరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ నెల 10న ఉదయం 7.50 గంటల సమయంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు సమాచారాన్ని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.