సోనమ్ వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుండి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలంటూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో దాఖలు చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఆదివారం తిరస్కరించింది. ఈ విషయంలో కేంద్రం వాదనను సమర్థించిన కోర్టు, ఆయన ‘శారీరక స్వయంప్రతిపత్తి’ హక్కుకు ఎటువంటి భంగం కలగలేదని పేర్కొంది. ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్లే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని, అది ఏకపక్షమైన చర్య కాదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తున్నప్పటికీ ఆసుపత్రిలో చేరడానికి నిరాకరించినందున, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సమంజసమేనని జస్టిస్ మినీ పుష్కర్ణ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే, తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ అంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం, ఢిల్లీ పోలీసులు, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అలాగే, అంగ్మో, వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులకు అతన్ని ఎప్పుడైనా (అహర్నిశలూ) కలిసే అవకాశం కల్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా వ్యవస్థలో అవకతవకలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు మద్దతుగా సోనమ్ వాంగ్ చుక్ జూన్ 28న ఈ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పోలీసులు వాంగ్‌చుక్‌ను బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. తమకు నచ్చిన ఆసుపత్రికి మార్చుకునేందుకు వీలుగా ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేయాలని కోరుతూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వాంగ్‌చుక్‌ను మార్చాలని తాము కోరుకుంటున్నట్లు గీతాంజలి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపించారు. అయితే, చికిత్స విషయంలో వాంగ్‌చుక్ వైద్యులకు సహకరించాలని, అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని చేతన్ శర్మ ధర్మాసనాన్ని కోరారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం వైద్యులకు సహకరించాలన్నది వాంగ్‌చుక్ వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని వెల్లడించింది. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న గీతాంజలి పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి యాజమాన్యం, డిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది.

More Stories
ఏజెండాలో లేకపోయినా పునర్విభజన బిల్లు తెచ్చే అవకాశం!
ఈ ఏడాది ఇస్రో 7 ప్రయోగాలు
షిండే వర్గంలో యుబిటి ఎంపీల విలీనానికి ఆమోదం