ఆస్ట్రేలియా ‘పిచ్ బ్లాక్-2026’ లో రఫేల్ విమానాలతో తొలిసారి భారత్

ఆస్ట్రేలియా ‘పిచ్ బ్లాక్-2026’ లో రఫేల్ విమానాలతో తొలిసారి భారత్
ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక బహుళజాతి వైమానిక యుద్ధ విన్యాసాల్లో ఒకటైన పిచ్ బ్లాక్–2026లో పాల్గొనేందుకు భారత వైమానిక దళం (ఐఎఎస్) బృందం ఆస్ట్రేలియాకు చేరుకుంది. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ (ఆర్ఏఏఎఫ్) ఆధ్వర్యంలో ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్, టిండల్, అంబర్లీ వైమానిక స్థావరాల్లో జూలై 20 నుంచి ఆగస్టు 7 వరకు ఈ భారీ విన్యాసాలు జరగనున్నాయి.

భారత బృందంలో నాలుగు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానాలు, 120 మందికి పైగా వైమానిక సిబ్బంది ఉన్నారు. ఈసారి రఫేల్ యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాల్గొనడం విశేషం. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే పిచ్ బ్లాక్ విన్యాసాలు ప్రపంచ వైమానిక దళాలకు కీలక వేదికగా గుర్తింపు పొందాయి. 

ఈ ఏడాది 20కి పైగా మిత్ర, భాగస్వామ్య దేశాలకు చెందిన సుమారు 100 యుద్ధ, రవాణా, సహాయక విమానాలు, 2,500 మందికి పైగా సైనిక, వైమానిక సిబ్బంది పాల్గొంటున్నారు. అమెరికా, భారత్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఫిలిప్పీన్స్ తదితర దేశాల వైమానిక దళాలు ఈ విన్యాసాల్లో భాగమవుతున్నాయి. 

సంయుక్త వైమానిక ఆపరేషన్లు, క్లిష్టమైన యుద్ధ పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. పిచ్ బ్లాక్–2026 భారత వైమానిక దళానికి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే రఫేల్ యుద్ధ విమానాలతో భారత్ తొలిసారిగా ఈ అంతర్జాతీయ విన్యాసాల్లో పాల్గొంటోంది. 

దీంతో అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలను ప్రపంచ దేశాల ముందు ప్రదర్శించడంతో పాటు, ఇతర దేశాల వైమానిక దళాలతో సంయుక్త కార్యాచరణ అనుభవాన్ని సొంతం చేసుకునే అవకాశం లభించనుంది. భారత్–ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కూడా ఈ విన్యాసాలు కీలకంగా మారనున్నాయి.

ఈసారి జపాన్ కూడా తొలిసారిగా తన అత్యాధునిక ఎఫ్-35 లైట్నింగ్–II  స్టెల్త్ యుద్ధ విమానాలను పిచ్ బ్లాక్ విన్యాసాల్లో మోహరిస్తోంది. దీంతో ఈ విన్యాసాలు మరింత ఆసక్తికరంగా మారాయి. “పిచ్ బ్లాక్” అంటే “గాఢాంధకారం” లేదా “కటిక చీకటి” అని అర్థం. ప్రారంభ దశలో ఈ విన్యాసాలు పూర్తిగా రాత్రి వేళల్లో నిర్వహించేవారు. అందుకే ఈ పేరును పెట్టారు. ప్రస్తుతం పగలు, రాత్రి రెండింటిలోనూ విన్యాసాలు నిర్వహిస్తున్నప్పటికీ, “పిచ్ బ్లాక్” అనే పేరునే కొనసాగిస్తున్నారు.