పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకే పెరుగుతున్నాయి. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై ఇప్పటికే అమెరికా-ఇరాన్ పోటీపడి దాడులు చేస్తున్నాయి. మరోవైపు యుద్ధం ప్రారంభంలో ఇరాన్ అమర్చిన మందుపాతరలు మరో ముప్పుగా పరిణమించాయి.
శనివారం తెల్లవారుజమున రెండు చమురు ట్యాంకర్లు సముద్రంలో ఇరాన్ అమర్చిన సీ మైన్స్‌ను ఢీకొట్టి పేలిపోయాయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ‘కొద్దిసేపటి క్రితం హర్మూజ్‌లో ముందుపాతరలు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లిన రెండు చమురు ట్యాంకర్లు పేలిపోయాయి’ అని ఐఆర్‌జీసీ ప్రకటించింది. అమెరికా నిఘా సంస్థలు మోసపూరితంగా ఆ నౌకలను ఆ మార్గం నుంచి పంపేందుకు ప్రయత్నించినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.
అయితే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ప్రయత్నంలో మైన్ పేలుళ్ల కారణంగా రెండు చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయన్న టెహ్రాన్ వాదనలను యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తోసిపుచ్చింది. అదేవిధంగా ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నాలుగు నౌకలను కూడా తాము అడ్డుకున్నామని తెలిపింది. మరోవైపు ఏడోరోజు కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగాయి. దాంతో దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
అమెరికా మరో రెండు నుంచి మూడు రోజుల్లో కూడా యుద్ధాన్ని కొనసాగిస్తే, ఇరాన్ ప్రతీకార దాడులతో సరిపెట్టకుండా పూర్తి స్థాయి దాడికి దిగుతుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ సీనియర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. ఇకపై రాజకీయ సరిహద్దులు కూడా తమ దాడులను అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు. చర్చలు, దౌత్య ప్రయత్నాల దశ ముగిసిందని, పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముందని హెచ్చరించారు.
అన్నట్టే యూఎస్ స్థావరాలు లక్ష్యంగా చేస్తున్న ప్రతీకార దాడులను ఇరాన్ కొనసాగిస్తున్నది. తాజాగా కువైట్, జోర్డాన్‌పైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కువైట్‌లోని క్యాంప్ అరిఫ్జాన్‌లో ఉన్న అమెరికా సైనిక లాజిస్టిక్స్ కేంద్రాన్ని డ్రోన్లు, క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఈ దాడిలో అక్కడ ఉన్న అమెరికా సైనిక సిబ్బందికి నష్టం వాటిల్లిందని పేర్కొంది.
అలాగే కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌పై కూడా దాడి నిర్వహించినట్లు వెల్లడించింది. ఈ దాడిలో రాడార్ వ్యవస్థలు, ఆయుధాల నిర్వహణ హ్యాంగర్, డ్రోన్ కేంద్రం ధ్వంసమైనట్లు ఇరాన్ వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ వాదనలపై అమెరికా నుంచి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు. ఈ దాడుల నేపథ్యంలో కువైట్ విమాన కార్యకలాపాలను నిలిపివేసింది. అమెరికా సైనిక బలగాలకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని మరోవైపు ఇరాన్ మీడియా వెల్లడించింది.

More Stories
లేబర్ పార్టీ నేతగా ఆండీ బర్న్‌హమ్..సోమవారమే ప్రధానిగా!
అమెరికాలో గ్యాంగ్‌స్టర్ నితీష్ కౌశల్
అమెరికా ఎన్నికల డేటాను చైనా తారుమారు?