బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై జపాన్‌ మాజీ మంత్రి ఆరోపణల దుమారం

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై జపాన్‌ మాజీ మంత్రి ఆరోపణల దుమారం

ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రెయిన్‌ ప్రాజెక్టులో జాప్యానికి ఒక భారతీయ మంత్రి, అధికారులు బాధ్యులని జపాన్‌కు చెందిన ఒక మాజీ మంత్రి ఆరోపంచడం రాజకీయ దుమారం రేపింది. షింకన్సన్‌ ప్రాజెక్టుపై చర్చల సందర్భంగా అధికారులు పదేపదే తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమై స్వప్రయోజనాల కోసం పనిచేశారని జపాన్‌ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా ఆరోపించారు. 

వారిది(అధికారులు) పూర్తి నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టు అసలు షింకన్సన్‌ నమూనా నుండి వేరుపడిందని జపాన్‌ వార్తా సంస్థ ఒకటి కథనాన్ని ప్రచురించిన తర్వాత మకిహారా ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు ప్రతిష్టాత్మక హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనుల్లో పురోగతి లేకపోవడానికి కారణం పూర్తిగా భారత్‌ వైపు నుండే అని ఎక్స్‌ పోస్టులో మకిహారా పేర్కొన్నారు. 
 
భారతదేశపు మొట్టమొదటి హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్‌) మార్గంలో ప్రయాణికుల రాకపోకల సేవలు దశలవారీగా 2027 ఆగస్టు 15న ప్రారంభమవుతాయని అంచనా. ముంబై-అహ్మదాబాద్‌ కారిడార్‌ జపనీస్‌ షింకన్సెన్‌ సాంకేతికతను ఉపయోగిస్తుంది. దీనికి జపాన్‌ ప్రభుత్వానికి చెందిన జపాన్‌ అంతర్జాతీయ సహకారం సంస్థ(జేఐసీఏ) పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది.
 
తాజాగా దీనిపై స్పందించిన భారత్.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలను తోసిపుచ్చింది. మీడియా సమావేశంలో ఈ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బదులిస్తూ ‘‘ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం.. వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలుపై భారత్-జపాన్ చర్చలు వాస్తవానికి సానుకూలంగా జరుగుతున్నాయి’’ అని ఆయన తెలిపారు.
 
హైస్పీడ్ రైలు భద్రతకు అత్యంత కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ సరఫరా విషయంలో జపాన్‌ను పక్కనబెట్టారని ఆ దేశ మాజీ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. షిన్‌కాన్సెన్ టెక్నాలజీని పూర్తిస్థాయిలో బుల్లెట్ రైలు కోసం వినియోగించకపోవడంపై జపాన్‌లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 
 
‘‘సంబంధిత రైలు ప్రాజెక్ట్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున 2030ల ప్రారంభంలో జపాన్ ఈ10 క్లాస్ కోచ్‌లను అందిస్తుంది’’ అని జైస్వాల్ చెప్పారు. అంతేకాదు, నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, బులెట్ రైలు కారిడార్ లోని మొదటి విభాగం ఆగష్టు 15, 2027లో ప్రారంభం అవుతుందని  తెలిపారు.   “సిగ్నలింగ్ పరికరాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్డర్ చేశాం. ఈ విషయంలో జపాన్ నుంచి ఎటువంటి ప్రతిపాదన అందలేదు. హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఉమ్మడి లక్ష్యానికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అమలు జరుగుతోంది’’ అని రణధీర్ జైస్వాల్ తెలిపారు.