భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు ఎగుమతి కంటైనర్లను అధికారికంగా ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) వద్ద ఈ కంటైనర్లను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభిస్తూ భారత్-యూకే ఆర్థిక సంబంధాలలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అని, ఇది భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.
విదేశీ వాణిజ్య విభాగం, హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ భారత్-యూకే సీఈటీఏ ఒప్పందం విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాధాన్యత పన్ను రాయితీలను కల్పిస్తుందని, యూకే మార్కెట్లో భారతీయ వ్యాపారాలకు ఎగుమతి అవకాశాలను గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు.
జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీశ్రీ మాట్లాడుతూ ఈ ఒప్పందం వల్ల లభించే ప్రయోజనాలు చిన్న పరిశ్రమలకు కూడా అందుతాయన్నారు. ఫార్మా, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో తెలంగాణ ఇప్పటికే బలంగా ఉన్నందున, ఈ ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని మరింత ముందంజలో ఉండగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అపెడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అధిపతి ఆర్.పి. నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాల ఉత్పత్తులు, మిఠాయిలు, చిరుధాన్యాలు సహా అపెడా పరిధిలోని ఉత్పత్తుల ఎగుమతులకు ఈ ఒప్పందం గొప్ప అవకాశాలను అందిస్తుందని చెప్పారు.యూకే హైకమిషన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ హెడ్ సిద్ధార్థ్ విశ్వనాథన్ మాట్లాడుతూ మెరుగైన మార్కెట్ ప్రవేశం, సరళీకృత కస్టమ్స్ విధానాలు, సులువైన డాక్యుమెంటేషన్ ద్వారా ఇది వాణిజ్యాన్ని సులభతరం చేస్తుందని, తద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణకు ఉన్న ముఖ్యమైన ఎగుమతి గమ్యస్థానాలలో యూకే ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి యూకేకు సుమారు 402.5 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రధాన ఎగుమతి వస్తువులలో ఫార్మాస్యూటికల్స్, బయోలాజికల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులు, వైద్య పరికరాలు ఉన్నాయి.
పలు ఉత్పత్తులపై పన్నులను పూర్తిగా రద్దు చేయడం లేదా గణనీయంగా తగ్గించడం వల్ల యూకే మార్కెట్లో తెలంగాణ ఎగుమతులకు మంచి పోటీతత్వం లభిస్తుంది. ఈ ఒప్పందం ముఖ్యంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయం వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

More Stories
ఓబీసీలకు కాంగ్రెస్ అడుగడుగునా ద్రోహం చేసింది
తెలంగాణాలో ఎస్ఐఆర్ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు
మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి