ప్రభుత్వం, యజమానులు, ఉద్యోగులతో కూడిన పారిశ్రామిక కుటుంబం అనే భావనను పరస్పర విశ్వాసం, సంభాషణల ద్వారా మాత్రమే సాధించగలమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు.
భారతదేశపు బ్రిక్స్ అధ్యక్షతన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మూడు రోజులపాటు జరిగిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ (బిటియుఎఫ్) సదస్సు-2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ సాంకతికత అసమానతలను పెంచకుండా, మానవాళికి సేవ చేసేలా, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలను సృష్టించేలా వారు కలిసి పనిచేయాలని సూచించారు.
కార్మికుల హక్కులను బలోపేతం చేయడం, సార్వత్రిక సామాజిక భద్రత, సమ్మిళిత వృద్ధి, సామాజిక సంభాషణ, సుస్థిర అభివృద్ధి పట్ల బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ల సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ సదస్సు చివరిలో ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది.
బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, భాగస్వామ్య దేశాల ప్రతినిధులకు హైదరాబాద్‌కు గవర్నర్ స్వాగతం పలుకుతూ, తెలంగాణ గొప్ప చరిత్ర, ఉజ్వల సంస్కృతి,ఆత్మీయ ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందిన గడ్డ అని అభివర్ణించారు. కార్మిక, అభివృద్ధి, సామాజిక న్యాయంపై చర్చలకు అంకితమైన ఒక ముఖ్యమైన అంతర్జాతీయ వేదికకు హైదరాబాద్ వేదిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి అని, బ్రిక్స్ దేశాలు సమిష్టిగా ప్రపంచ జనాభాలో, ఆర్థిక ఉత్పత్తిలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ ఇది మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో వాటిని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలుపుతుందని గవర్నర్ భరోసా వ్యక్తం చేశారు.
సాంకేతిక పురోగతి, డిజిటల్ పరివర్తన, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు ప్రపంచవ్యాప్తంగా కార్మిక మార్కెట్లను పునర్నిర్మిస్తున్నాయని గవర్నర్ తెలిపారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 హైదరాబాద్ ప్రకటనను అత్యధిక మెజారిటీతో ఆమోదించినందుకు ఆయన ప్రముఖులను అభినందించారు. చర్చల ఫలితంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, కార్మికుల హక్కులను పరిరక్షించడం, సామాజిక భద్రతను బలోపేతం చేయడం, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం, బ్రిక్స్ దేశాల వ్యాప్తంగా సుస్థిర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలకు హైదరాబాద్ ప్రకటన నూతన దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్మికులకు, వారి కుటుంబాలకు గౌరవం, భద్రత, మెరుగైన జీవన నాణ్యతను అందించే లక్ష్యంతో చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా, సంఘటిత, అసంఘటిత రంగాలలోని కార్మికులకు సామాజిక భద్రతా పరిధిని విస్తరించడంలో భారతదేశం సాధించిన గణనీయమైన విజయాలను కూడా ఆయన నొక్కి చెప్పారు.
ముగింపు సమావేశానికి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షులు, సదస్సు ఛైర్‌పర్సన్ ఎస్. మల్లేశం అధ్యక్షత వహించారు. వేదికపై ఉన్న ప్రముఖులలో కార్లోస్ అగస్టో ముల్లర్ (బ్రెజిల్), సెర్గీ చెర్నోగాయెవ్ (రష్యా), హుజియాంగ్ జు (చైనా), మసాలే గాడ్‌ఫ్రే సెలెమట్సెలా (దక్షిణాఫ్రికా), బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ ముఖ్య సమన్వయకర్త బి. సురేంద్రన్, బిఎంఎస్ కార్యదర్శి శ్రీమతి అంజలి పటేల్‌తో పాటు, బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నుండి సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రతినిధులు ఉన్నారు.
బి.ఎం.ఎస్. ఉపాధ్యక్షులు పవన్ కుమార్ స్వాగతం పలుకుతూ, కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి, గౌరవప్రదమైన ఉపాధి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై ఈ శిఖరాగ్ర సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. సిఫార్సులు, హైదరాబాద్ ప్రకటన బ్రిక్స్ కార్మిక సంఘాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
బిఎంఎస్ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ, ఈ శిఖరాగ్ర సమావేశం నాలుగు పరివర్తనాత్మక అంశాలపై దృష్టి సారించిందని చెప్పారు. అవి: అందరికీ సార్వత్రిక సామాజిక భద్రత, మహిళా శ్రామిక శక్తి సాధికారత, నైపుణ్యాభివృద్ధి, పునఃనైపుణ్యాభివృద్ధి, ఉన్నత నైపుణ్యాభివృద్ధి, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు , కార్మిక రంగ భవిష్యత్తు. కార్మికుల సంక్షేమం, సుస్థిర అభివృద్ధి, సామాజిక సంభాషణ.
గౌరవప్రదమైన పని పట్ల బ్రిక్స్ కార్మిక సంఘాల ఉమ్మడి నిబద్ధతను హైదరాబాద్ ప్రకటన ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. పాల్గొన్న బ్రిక్స్ దేశాల ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రశంసించారు. కార్మికుల హక్కులు, సార్వత్రిక సామాజిక భద్రత, గౌరవప్రదమైన పని, సమ్మిళిత వృద్ధి, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ సమిష్టి నిబద్ధతను పునరుద్ఘాటించారు.
చైనా ప్రతినిధి బృందం ఈ చర్చలను నిర్మాణాత్మకమైనవిగా, దూరదృష్టితో కూడినవిగా అభివర్ణించింది. హైదరాబాద్ ప్రకటన బ్రిక్స్ కార్మిక సంఘాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. బిఎంఎస్ జాతీయ కోశాధికారి అనీష్ మిశ్రా వందన సమర్పణ చేశారు.

More Stories
ఇరాన్ సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న అమెరికా
రెండు దశాబ్దాల తర్వాత కోల్‌కతా రానున్న తస్లీమా నస్రీన్
అమల్లోకి భారత్- బ్రిటన్ సమగ్ర ఆర్ధిక, వాణిజ్య ఒప్పందం