షాబాద్‌లో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్య!

షాబాద్‌లో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ఆత్మహత్య!

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ మృతిచెందాడు. స్థానికులు డయల్ 100కు ఇచ్చిన సమాచారంతో కొత్తూరు మండలం పెంజర్ల వద్ద రాజ్‌కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  ఆ కేసు హంతకుడు రాజ్‌కుమార్ మృతదేహం అతని మేనమామ ఊరు కొత్తూరు మండలం పంజర్లలో లభ్యమైనట్లు చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ వెల్లడించారు. 

రాజ్‌కుమార్ విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు. ఘటనాస్థలిలో పాయిజన్‌ బాటిల్ లభ్యమైందని తెలిపారు. ఆ ఆధారాలను సేకరించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. తనపై పోక్సో కేసు పెట్టారని బాలిక, బాలిక తల్లి, నానమ్మను నిందితుడు రాజ్​కుమార్​ శుక్రవారం రాత్రి దారుణంగా హతమార్చాడు. 

అనంతరం ఇంటికి వెళ్లి భార్య సరిత, ఇద్దరు కుమారులను హత్యచేశాడు. అనంతరం అక్కడనుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకొనేందుకు ఏకంగా 12 పోలీసు బృందాలు ముమ్మరంగా గాలించాయి.  మరోవైపు నిందితుడిని పట్టిస్టే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. చివరకు కొత్తూరు సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఆరుగురి హత్య ఘటన తీవ్ర భయాందోళన రేపింది. దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌ మానవ మృగంలా మారి భార్య పిల్లలు సహా మరో ముగ్గురిని కిరాతకంగా హతమార్చాడు. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత రాజ్‌కుమార్‌ కత్తితో కిరాతకాన్ని మొదలుపెట్టి, అరగంటలో ఆరు ప్రాణాలు తీశాడు.

ఆ రాత్రి 11.05 సమయంలో షాబాద్‌ పీఆర్‌ఆర్‌ స్టేడియం సమీపంలోని బాలిక ఇంట్లోకి వెళ్లిన నిందితుడు రాజ్‌కుమార్‌ ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన బాలిక తల్లి, నానమ్మను చంపేశాడు. బాలికను బెదిరించి తనతో పాటు కారులో దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి, గొంతు కోసి చంపాడు.  అనంతరం తన ఇంటికి వెళ్లి, భార్య సరిత, ఇద్దరు చిన్నారులను హతమార్చాడు. అనంతరం తండ్రికి ఫోన్​ చేసి ఆరుగురిని చంపిన విషయం చెప్పాడు. 

నిందితుడు పార్వతి రాజ్​కుమార్​ ఇంటర్ చదివే సమయంలో అదే గ్రామానికి చెందిన సరిత ఇంటికి ట్యూషన్​కు వెళ్లాడు. ఆమె రాజ్​కుమార్​ కంటే వయసులో ఆరేళ్లు పెద్ద అయినా ప్రేమించి, పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నాడు.  పెళ్లయ్యాక రెండేళ్లు డ్రైవర్​గా పని చేశాడు. ఆ తర్వాత పనిమానేసి మద్యం, జూదం వ్యసనాలకు అలవాటై రూ.2.5 కోట్లకు పైగా అప్పు చేశాడు. అప్పుల ఒత్తిడి భరించలేక గతేడాది అక్టోబరులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలో పొలం అమ్మి కొన్ని అప్పులు తీర్చామని రాజ్​కుమార్​ తండ్రి అరుణ్​కుమార్​ పోలీసులకు చెప్పాడు.