సొంత లాంచ్‌ ప్యాడ్‌ నిర్మించనున్న స్కైరూట్

సొంత లాంచ్‌ ప్యాడ్‌ నిర్మించనున్న స్కైరూట్
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సొంతంగా లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించనున్నట్టు ప్రకటించింది. వారి తొలి ఆర్బిటాల్‌ మిషన్‌ విక్రమ్‌-1 ‘ఆగమన్‌’ ద్వారా బహుళ పేలోడ్స్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పెట్టడం ద్వారా ప్రైవేట్‌ రంగంలో భారత్‌లో తయారై కక్ష్యను చేరిన మొదటి రాకెట్‌గా రికార్డు సృష్టించింది. ప్రారంభ మిషన్ల కోసం ఇస్రో సౌకర్యాలనే ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే స్వతంత్ర లాంచ్‌ పనులపై దృష్టి సారించింది. 
 
స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పవన్‌ చందన మాట్లాడుతూ “మేము ఇస్రోతో సుదీర్ఘకాలం కలిసి పనిచేశాం. మొదటి కొన్ని మిషన్లు ఇస్రో కేంద్రాల నుంచే జరుగుతాయి. అయితే మా సొంత లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించే ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి” అని తెలిపారు. లాంచ్ ప్యాడ్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని గానీ, దీనికి సంబంధించిన ఖచ్చితమైన కాలక్రమాన్ని గానీ పవన్ వెల్లడించనప్పటికీ, సంస్థ రాబోయే రోజుల్లో మరింత రద్దీగా ఉండే ప్రయోగ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నందున ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.
“ప్రస్తుతం ఆ వివరాలను పంచుకోవడం కష్టం. దీనికి సంబంధించిన ప్రణాళిక ఖచ్చితంగా ఉంది, కానీ ఈ దశలో అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేము,” అని ఆయన తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని చెప్పారు. సొంత లాంచ్‌ ప్యాడ్‌ ఉండడం వల్ల స్కైరూట్‌కు మరింత కార్యాచరణ స్వేచ్ఛ లభిస్తుంది. 
 
శ్రీహరికోటలోని ఇస్రోకు చెందిన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ మౌలిక సదుపాయాలపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా స్వతంత్రంగా లాంచ్‌లను షెడ్యూల్‌ చేయడానికి వీలవుతుంది. స్కైరూట్‌ రాబోయే విక్రమ్‌ మిషన్లు, వాణిజ్య ప్రయోగాల కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రత్యేక లాంచ్‌ కాంప్లెక్స్‌ అత్యంత కీలకమైన మౌలిక సదుపాయంగా మారనుంది. 
 
ఇది కంపెనీ సేవలను విస్తరించడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్‌ స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ మార్కెట్‌లో పోటీ పడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ నిర్ణయం భారతీయ ప్రైవేట్‌ అంతరిక్ష రంగానికి, అందులో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ మహత్తర ప్రణాళికలకు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుంది.

భారత ప్రభుత్వం, ఇస్రో శ్రీహరికోటలో నిర్మించతలపెట్టిన మూడో లాంచ్‌ ప్యాడ్‌ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం సుమారు రూ. 3,985 కోట్లు. ఈ ప్యాడ్‌ను పెద్దతరహా రాకెట్లు(ఎన్‌జీఎల్‌వీ, హ్యూమన్‌ స్పేస్‌ఫ్లైట్‌/గగన్‌యాన్‌ లాంటి మానవసహిత యాత్రలు) ప్రయోగించడానికి అనువుగా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. చిన్న తరహా ప్రైవేట్‌ రాకెట్లు ప్రయోగించడానికి అవసరమైన లాంచ్‌ ప్యాడ్స్‌ లేదా మొబైల్‌ లాంచ్‌ స్టాండ్లు నిర్మించడానికి సుమారు రూ. 80 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఖర్చు కావచ్చు