సింగరేణిలో అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ

సింగరేణిలో అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ

సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొంటూ  గతంలో డబ్బులు తీసుకుని మైన్స్ కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్ అక్రమంగా కేటాయించిన మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని,  బొగ్గు గనులను పారదర్శకంగా కేటాయించాలని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 

పదేళ్ల పాటు సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారని ధ్వజమెత్తారు. సింగరేణికి చేసిన మేలు ఏమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం  49 శాతం వాటా ఉన్నా బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ, ఏం జరిగినా కేంద్రాన్ని సంప్రదించడం లేదని, సింగరేణి కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 

ఇప్పటివరకు వేలం ద్వారానే బొగ్గు గనులు కేటాయిస్తూ వచ్చామని, మోదీ ప్రభుత్వం వేలం లేకుండా ఇచ్చిన ఏకైక బ్లాక్ తాడిచర్ల-2 అని తెలిపారు. తాడిచర్ల2 బ్లాక్ లో గ్రేడ్-8 బొగ్గు అందుబాటులో ఉందని, మరో 40, 50 ఏళ్లపాటు తాడిచర్ల 2 బ్లాక్ లో నాణ్యమైన బొగ్గు దొరుకుతుందని చెప్పారు.  1999 లో రూ.600 కోట్లు ఇచ్చి సింగరేణిని దివంగత ప్రధాన మంత్రి వాజ్ పేయి ఆదుకున్నారని, అప్పుడు, ఇప్పుడు సింగరేణిని కాపాడింది ఎన్డిఎ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి తెలిపారు.
సింగరేణికి ఇవ్వాల్సిన నిధులను కెసిఆర్ ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. సింగరేణి నుంచి తీసుకున్న బొగ్గు, విద్యుత్ కు అప్పు పెట్టారని, బిఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.24 వేల కోట్లు అప్పు పెట్టిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.   గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, చివరికి సింగరేణి సంస్థను నష్టాల బాట పట్టించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు విమర్శించారు.
ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సింగరేణి సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని ధ్వజమెత్తారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా విస్మరించిందని తెలిపారు.  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు ‘తడిచెర్ల-II’ బొగ్గు బ్లాక్ కేటాయింపు ప్రాముఖ్యతను వివరించడానికి, సింగరేణిని బలోపేతం చేయడంలో గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి తెలంగాణ రాష్ట్ర బిజెపి సోమవారం రెండు రోజుల “సింగరేణి భరోసా యాత్ర”ను ప్రారంభించింది.  
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుండి ఈ  యాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.  కొత్తగూడెం చేరుకున్న బీజేపీ నాయకులకు భారీ సంఖ్యలో తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ శ్రీమతి డి.కె. అరుణ, బీజేఎల్పీ నేత ఎ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య, ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొంటున్నారు.