* కుటుంబాలతో ప్రయాణించే వారికి అనుకూలతలో ప్రపంచంలోనే నాలుగో స్థానం, భారత్‌లో రెండో స్థానం
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (శంషాబాద్ విమానాశ్రయం) మరో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. కుటుంబాలతో ప్రయాణించే వారికి అత్యంత అనుకూలమైన విమానాశ్రయాల జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ సంస్థ అట్రాక్షన్ టికెట్స్.కామ్ నిర్వహించిన ‘హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్ ర్యాంకింగ్స్’లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఈ ఘనతను సాధించింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతదేశంలోని 2 విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఒకటిగా నిలవడం విశేషం. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 140కుపైగా విమానాశ్రయాలను ఈ ట్రావెల్ సంస్థ పరిశీలించింది. ప్రధానంగా కుటుంబ సభ్యులతో ప్రయాణించే వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ప్రకటించారు.
పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, బేబీ చేంజింగ్ సదుపాయాలు, ఫ్యామిలీ సెక్యూరిటీ లేన్లు, స్ట్రోలర్ సేవలు, విశ్రాంతి ప్రాంతాలు, ఉచిత వై ఫై, ప్రయాణికుల భద్రత, విమానాశ్రయ విస్తీర్ణం, గూగుల్ సమీక్షలు, ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికులకు అందిస్తున్న సేవలు వంటి మొత్తం 9 ప్రమాణాల ఆధారంగా ప్రతీ ఎయిర్‌పోర్టును అంచనా వేశారు.
ఈ పరిశీలనలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 20 పాయింట్లకు గాను 18.5 పాయింట్లు సాధించి ప్రపంచంలోనే నాలుగో అత్యుత్తమ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా గుర్తింపు పొందింది. ప్రయాణికుల సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు, అందరికీ అందుబాటులో ఉండే సేవలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సాధించిన ఘనతపై జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో కదీర్ కదిరవన్ స్పందించారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సమగ్ర సేవలు అందించాలనే తమ లక్ష్యానికి ఈ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రయాణ అనుభవాన్ని నిత్యం మెరుగుపరుస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.

More Stories
తెలంగాణాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో 88 లక్షల ఓట్లు గల్లంతు!
సింగరేణిలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోపిడీ
షాబాద్‌లో ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!