సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 బొగ్గు గనులు

సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 బొగ్గు గనులు
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు గనులు కేటాయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. గత కొంత కాలంగా ఎంపీలు, ఎమ్మెల్యే లు, కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం కూడా తాడిచర్ల కావాలని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు.  తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని  తాడిచర్ల బ్లాక్-2కు సంబంధించిన మై నింగ్ లీజ్‌ను సింగరేణికి కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరడంతో వెంటనే అనుమతించారని ఆయన వివరించారు. 
 
ఇందులో భాగంగా తెలంగాణ గుండె చప్పుడు అయిన 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) అభివృద్ధి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు.  సింగరేణికి సంబంధించిన మేజర్ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో కేంద్రం సహకారం అందిస్తోందని ఆయన తెలిపారు. 
 
సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో, ఆదాయ వనరులు సమకూర్చుకునే విషయంలో కొన్ని ఇ బ్బందులున్నాయని, దీని కోసం సింగరేణి యాజమాన్యం పని చేస్తోందని చెప్పారు.  ఇతర రాష్ట్రాల్లో బొగ్గు వేలంలో పాల్గొనేలా సింగరేణికి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అభివృద్ధి విషయంలో, సహకార సమాఖ్య విధానంతో అన్ని రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 
 
తాను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒడిశాలోని నైని బ్లాక్ కోసం ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి ఇప్పించానని ఆయన గుర్తు చేశారు. దీంతో విజయవంతంగా నైని బొగ్గు గనిలో బొగ్గు ఉత్పత్తి అవుతోందని ఆయన తెలిపారు. నైని కోల్ బ్లాక్‌లో సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్ ఉందని, ఇది 30 నుంచి 35 సంవత్సరాలకు సరిపోతుందని చెప్పారు. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం సింగరేణికి లభించిందని ఆయన తెలిపారు. 

దీని వల్ల సింగరేణికి సుమారు 75 వేల కోట్ల రెవెన్యూ సమకూరుతుందన్నారు. తాడిచర్ల-2 ద్వారా దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్ ఉన్న ఈ బ్లాక్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల పాటు ఈ గని నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని, దీని ద్వారా మొత్తంగా రూ.64,000 కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆయన చెప్పారు. 
 
నేరుగా సింగరేణికి ఈ గని ఇవ్వడంతో ఆక్షన్ ప్రీమియం చెల్లింపు లేని కారణంగా సింగరేణి సంస్థకు కనీసం రూ.2,550 కోట్లు మిగులుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాయల్టీ సహా వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ఆయన చెప్పారు. కోల్ బ్లాక్ ద్వారా సింగరేణిలో సుమారు 1,200 అదనపు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఇంకా నైని కోల్ బ్లాక్ లో 1,500 కొత్త ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుందని వివరించారు.