హైదరాబాద్ లో బిఎల్ఓలు ఇంటింటికి తిరగడం లేదు 

హైదరాబాద్ లో బిఎల్ఓలు ఇంటింటికి తిరగడం లేదు 
* ఏంఐఏం శిబిరాల్లో ఫారంలను సరఫరా చేస్తున్నారని బిజెపి ఫిర్యాదు 
 
‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా, ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీలో బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ ఫారమ్‌లను పంపిణీ చేయడం లేదని బిజెపి ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు నేతృత్వంలో సమర్పించిన వినతిపత్రంలో దానికి బదులుగా ఎంఐఎం నాయకులు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వాటిని పెద్ద మొత్తంలో పంపిణీ చేస్తున్నారని తెలిపారు. 
 
నింపిన ఫారమ్‌లను అప్‌లోడ్ చేయడానికి ఎన్నికల సంఘం యాప్‌ను ఉపయోగించే అవకాశాన్ని బిఎల్ఓలు ఎంఐఎం నాయకులకు కల్పిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), సైబరాబాద్, మల్కాజిగిరి, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని చాలా మంది ఓటర్లకు వివరాల సేకరణ ఫారమ్‌లు అందలేదని పేర్కొన్నారు. 
 
అలాగే ఇళ్లను గుర్తించడంలో బిఎల్ఓలు ఇబ్బంది పడుతున్నారని బిజెపి పేర్కొంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు పోలింగ్ బూత్‌ల జాబితాల్లో ఉండటం వల్ల, ఆయా ఇళ్లను సందర్శించడం బీఏలోలకు కష్టంగా మారిందని చెప్పారు.  హైదరాబాద్‌లో ఆంగ్లంలో ముద్రించిన ఫారమ్‌లను పంపిణీ చేస్తుండగా, జిల్లాల్లో మాత్రం ఎక్కువగా తెలుగు ఫారమ్‌లను పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లకు ఆ ఫారమ్‌లలోని వివరాలు అర్థం కావడం లేదని బిజెపి తెలిపింది.
 
బిఎల్ఓలు ఇంటింటికీ వెళ్లడాన్ని తప్పనిసరి చేయాలని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే కనీసం మూడు సార్లయినా ఆ ఇళ్లను సందర్శించాలని బిజెపి సూచించింది. తెలంగాణలో ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే కార్యక్రమం జూన్ 25న ప్రారంభమైంది. ఇది జూలై 24 వరకు కొనసాగుతుంది.