థాయ్‌లాండ్ కు పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు అవసరం

థాయ్‌లాండ్ కు పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు అవసరం
థాయ్‌లాండ్ ప్రయాణ నిబంధనలు ఇప్పుడు మారాయని పేర్కొంటూ పర్యాటకులు  పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల చెల్లుబాటు కలిగి ఉండటంతో పాటు, తిరుగు ప్రయాణ టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాలు దగ్గర ఉంచుకోవాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. 
 
థాయ్‌లాండ్ చేరుకునే 72 గంటల ముందే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ పూర్తి చేయాలని చెబుతూ దీని ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలకు చాలా అవసరం అని తెలిపింది.  నిబంధనలను పాటించకపోతే ప్రయాణం మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పర్యాటకులు తమ పర్యటన సజావుగా సాగాలంటే ఎంబసీ సూచించిన ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపింది. 

వీసా ఆన్ అరైవల్ లేదా వీసా మినహాయింపు సౌకర్యం పొందే పర్యాటకులు ఆర్థిక నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇమ్మిగ్రేషన్ తనిఖీ సమయంలో ప్రతి పర్యాటకుడు కనీసం 20,000 థాయ్ బాట్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 58,000 నగదును తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేసింది. తగినంత డబ్బు లేకపోతే అధికారులు ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం ఉందని పేర్కొన్నది. 

అలాగే ప్రయాణ ఉద్దేశ్యానికి తగిన వీసాను ముందుగానే తీసుకోవడం ఉత్తమం అని సూచించింది. ఉద్యోగం కోసం వెళ్లేవారు పర్యాటక వీసాలపై వెళ్లడం చట్టవిరుద్ధం అని హెచ్చరించింది. అటువంటి వారు ఖచ్చితంగా వర్కింగ్ వీసాను మాత్రమే పొందాలని సూచించింది. ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా తమ తుది గమ్యస్థానానికి సంబంధించిన పత్రాలను, అవసరమైన వీసాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. 

ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర అడిగే ప్రశ్నలకు పక్కాగా సమాధానాలు చెప్పేలా సిద్ధంగా ఉండాలని, ప్రయాణానికి సంబంధించిన అన్ని పత్రాలను డిజిటల్ కాపీలతో పాటు ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోవడం వల్ల ఏ సమయంలోనైనా చూపడానికి సులభంగా ఉంటుందని సూచించింది. పర్యాటక వీసా అంటే కేవలం విహారయాత్ర కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు లేదా దేశం నుంచి వెనక్కి పంపే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.