మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్ చరిత్రలోనే అత్యంత కీలకమైన, శతాబ్దపు అతిపెద్ద చారిత్రాత్మక ఘట్టానికి రాజధాని టెహ్రాన్ వేదికైంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) అంత్యక్రియల కార్యక్రమాలు శనివారం నుండి వారం రోజులపాటు ఉద్విగ్న వాతావరణంలో కొనసాగుతున్నాయి. 2026 ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర దాడుల్లో ఆయన మరణించినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల సుమారు నాలుగు నెలల పాటు ఆలస్యమైన ఈ అంత్యక్రియలను, ప్రస్తుతం కుదిరిన అంతర్జాతీయ కాల్పుల విరమణ అనంతరం ఇరాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 7 రోజుల పాటు నిర్వహిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశంలో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్‌బీసీ’ పేర్కొంది.
టెహ్రాన్‌లో పలువురు ఖమేని సన్నిహితులు, నేతలు, ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని సన్నిహితుడు, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖమేని అంత్యక్రియల సందర్భంగా ఆయన ముగ్గురు కొడుకులు ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఖమేనికి మొజ్తాబాతోపాటు మరో ముగ్గురు కొడుకులున్నారు. వారు మొస్తాఫా ఖమేని, మెయ్సమ్ ఖమేని, మసౌద్ ఖమేని.
వీరు తమ తండ్రి అయతొల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ తండ్రి శవపేటికను చూసి ముగ్గురూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఖమేని కొడుకు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. భద్రతా కారణాలరీత్యా ఆయనను ప్రభుత్వం అనుమతించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఖమేని, అతడి కుటుంబ సభ్యుల మృతదేహాలున్న శవపేటికలు టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసాల్లా వద్ద ఉంచారు.
మొదటి రోజు ఈ పేటికల్ని ఇండోర్‌లోనే ఉంచారు. విదేశీ ప్రతినిధులు, ఇరాన్ కీలక నేతలు, అధికారులు వంటి వారికి మాత్రమే నివాళులు అర్పించే అవకాశం దొరికింది. రెండో రోజు పేటికల్ని బయటకు తీసుకొచ్చి, బహిరంగంగా ఉంచారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలకు లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తరలివస్తు్న్నారు. ఇది దేశ ప్రజల ఐక్యతకు నిదర్శనం అని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది.
ఈ నెల 9న ఖమేని అంత్యక్రియలు పూర్తవుతాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి నివాళులర్పించారు. అలీ ఖమేనీ వారసత్వం ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు. ఖమేనీ జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు విప్లవ అమరవీరుడైన అలీ ఖమేనీ మార్గదర్శకత్వంలో దయ, ఐక్యత, గౌరవం, స్వాతంత్ర్య సందేశం అన్ని దేశాలలో ప్రతిధ్వనిస్తోందని తెలిపారు.
తాను అమరవీరుడైన నాయకుడికి వీడ్కోలు పలకలేదని, ఎప్పటికీ పలకబోనని చెప్పారు. అలీ ఖమేనీ తన మనసులో, హృదయంలో ఎప్పటికీ సజీవంగా ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. తీవ్రమైన ఎండ వేడి ఉన్నప్పటికీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌కు నివాళులర్పించేందుకు లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి తరలివచ్చారు. ప్రజల కోసం అధికారులు చల్లని పానీయాలు, వాటర్ స్ప్రేలను ఏర్పాటు చేశారు.
ప్రజలు ఖమేనీ పోస్టర్లు పట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా, కక్ష తీర్చుకుంటామంటూ భారీగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ మత పెద్దలతో పాటు భారత్, చైనా, రష్యా, సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి విదేశీ దౌత్య ప్రతినిధులు హాజరై నివాళులు అర్పించారు.

More Stories
హర్మూజ్ జలసంధిలో కొత్తగా ఇరాన్ ‘సర్వీస్ ఫీజు’
జమ్మూకశ్మీర్ పాఠ్యపుస్తకాల్లో ఉగ్రవాదులపై పొగడ్తల దుమారం
20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు