ప్రపంచ దేశాలకు చమురు రవాణాలో అత్యంత కీలకంగా హర్మూజ్ జలసంధిపై.. కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. తమ ప్రాదేశిక జలాల పరిధిలోకి వచ్చే ఈ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఇక నుంచి సర్వీస్ ఫీజు వసూలు చేయాలని టెహ్రాన్ భావిస్తోంది. ఇది సాధారణ టోల్ కాదని, సముద్ర భద్రత, నౌకల రాకపోకల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి సేవలకు సంబంధించిన రుసుం అని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ ప్రతిపాదనపై ఒమన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిలో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నౌకల కదలికలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఈ కొత్త విధానం తీసుకువస్తున్నట్లు తేల్చి చెప్పారు.
సముద్ర కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, భారీ నౌకల రాకపోకల వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడం కూడా ఈ చర్యలో భాగమని పేర్కొన్నారు. అంతేకాకుండా క్లిష్ట సమయంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన మిత్రదేశాలకు ఈ సర్వీస్ ఫీజు విషయంలో ప్రత్యేక రాయితీలు లేదా మినహాయింపులు కల్పించే అంశాన్ని కూడా ఇరాన్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
దీనివల్ల ఆయా దేశాలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబాది కూడా హర్మూజ్ జలసంధి భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ జలసంధి భద్రతను ఒమన్‌తో కలిసి పర్యవేక్షిస్తామని.. ఇతర దేశాలు సైనిక విన్యాసాలకు హర్మూజ్ జలసంధిని వేదికగా ఉపయోగించరాదని తీవ్ర హెచ్చరికలు చేశారు.
హర్మూజ్ ప్రాంతం ఉద్రిక్తతలకు కాకుండా అంతర్జాతీయ వాణిజ్యానికి సురక్షిత మార్గంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ సూచించిన సముద్ర మార్గాన్ని పాటించకుండా ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన 8 నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి.
ఈ పరిణామాలు హర్మూజ్ జలసంధిలో కొత్త నియంత్రణలు అమల్లోకి వచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో అధిగ భాగం రవాణా అవుతుండటంతో.. ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్, షిప్పింగ్ రంగం, ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

More Stories
ఉద్విగ వాతావరణంలో అయతొల్లా ఖమేని అంత్యక్రియలు
బలూచీ ఆత్మాహుతి దాడుల్లో 30 మంది పాక్ భద్రతా సిబ్బంది మృతి
పీఓకె ఎన్నికలను బహిష్కరించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ