దేశంలో దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహిత ఇంధనాల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వస్తుంది. ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (ఈ20) మిశ్రమాన్ని అమలు చేస్తున్న కేంద్రం ఇప్పుడు డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబ్యుటనాల్ కలిపే విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌లో కలపడం సాధ్యం కాదని, అందుకే ఇథనాల్‌ను ఐసోబ్యుటనాల్‌గా మార్చి డీజిల్‌తో మిశ్రమంగా వినియోగించే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా జరిగిన పరిశోధనలు ఆశాజనక ఫలితాలు ఇచ్చాయని, ప్రయోగాత్మకంగా జనరేటర్లను ఈ ఇంధనంతో విజయవంతంగా నడిపినట్లు వెల్లడించారు.
భారత్‌లో పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్ వినియోగం దాదాపు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. దీంతో డీజిల్‌లో ప్రత్యామ్నాయ ఇంధనాలను మిక్సింగ్ చేయడం ద్వారా ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఐసోబ్యుటనాల్ (2 మిథైల్ 1 ప్రొపనాల్) నాలుగు కార్బన్ అణువులతో కూడిన ఒక ఆల్కహాల్ సమ్మేళనం. ఇది రంగులేని ద్రవం కాగా, స్వల్ప ఆల్కహాల్ వాసన కలిగి ఉంటుంది. ఇథనాల్‌తో పోలిస్తే దీనిలో శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉండటమే కాకుండా నీటిని తక్కువగా గ్రహిస్తుంది. అలాగే ఇది తక్కువగా ఆవిరయ్యే గుణం కలిగి ఉండటంతో నిల్వ, రవాణా, డీజిల్‌తో మిశ్రమం చేయడం మరింత సులభమవుతుంది.
మొక్కజొన్న, చెరుకు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను ప్రత్యేక రసాయన ప్రక్రియలు, అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా లేదా ఈస్ట్ సాయంతో ఐసోబ్యుటనాల్‌గా మారుస్తారు. ఐసోబ్యుటనాల్ లీటరుకు సుమారు రూ.55 నుంచి రూ.80 వరకు ఉత్పత్తి వ్యయం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బయోమాస్ లేదా ఇథనాల్ నుంచి తయారయ్యే ఐసోబ్యుటనాల్ గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న డీజిల్ వాహనాల ఇంజిన్లలో పెద్దగా మార్పులు చేయకుండానే ఈ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వాహన యజమానులపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని విస్తరించే వీలుంటుంది.

More Stories
సహజవాయువు సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
టెలిగ్రామ్ పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్ తొలగించాల్సిందే
బద్రీనాథ్‌లోనూ కానుకల చోరీపై విచారణ