పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణల కారణంగా దిగుమతి చేసుకునే వంట గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు అంతరాయం కలిగితే భారత్ ఎదుర్కొనే ముప్పు స్పష్టమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దేశీయంగా తగినంత నిల్వలను (బఫర్) సమకూర్చుకునే లక్ష్యంతో, ప్రభుత్వం మొదటిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రిఫైనరీలు అలాగే అప్‌స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ట ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.
ఆగస్టు 13న జారీ చేసిన ఉత్తర్వులో, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ట ఎల్పీజీ ఉత్పత్తి స్థాయిలను నిర్దేశించింది. వీటి ఉమ్మడి ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 63,810 టన్నులుగా నిర్ణయించారు. ఇది మార్చి 31, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశ దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి కంటే రెట్టింపు కంటే ఎక్కువ. దేశం రోజువారీ వినియోగంలో దాదాపు 70 శాతానికి సమానం.
సరఫరాలో కొరత ఏర్పడినప్పుడు ఈ ఉత్పత్తి పరిమితులు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్వహిస్తున్న 18 రిఫైనరీలకు రోజుకు మొత్తం 31,470 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకు 18,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీ (4,800 టన్నులు), నయారా ఎనర్జీ (4,480 టన్నులు) ఉన్నాయి. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం సామర్థ్యంలో రోజుకు 27,280 టన్నుల వాటాను కలిగి ఉన్నాయి.
ప్రైవేటు రిఫైనరీలలో అత్యధికంగా ఎల్పీజీ ఉత్పత్తి చేసే సామర్ధ్యం రిలయన్స్ సంస్థకు ఉంది. ఈ సంస్థ రోజుకు 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగలదు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిఫైనరీలో ఏడాదికి 33 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగలదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో 33.2 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగమైంది.
అంటే, రోజుకు సగటున 91,000 టన్నులు. వీటిలో 13.1 మిలియన్ టన్నుల ఎల్పీజీ దేశీయంగా ఉత్పత్తి అయితే, మిగిలిన 21.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని విదేశాల నుంచి దిగుమతి చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి దేశంలో చమురు ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష జరుపుతుంది. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం, చమురు సంస్థలు ఎల్పీజీ నిల్వ, తరలింపు, రవాణాకు అవసరమైన మౌలిక సమదుపాయాలను తగిన స్థాయిలో ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలి. రైల్వేలు, రోడ్డు ట్యాంకర్ల వంటి ఇతర రవాణా వ్యవస్థలను కూడా అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా, సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమైన మార్గాల ద్వారా ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని ఆదేశించింది.

More Stories
అయోధ్య విరాళాల చోరీ కేసులో చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్!
బ్యాంకుల్లో క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు రూ.1 లక్ష కోట్లు
సుప్రీంలో రాహుల్ గాంధీ ఆదాయంపై మించిన ఆస్తుల కేసు నేడే