సహజవాయువు సరఫరాపై విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. పశ్చిమాసియా నుంచి హర్మూజ్ జలసంధి ద్వారా ద్రవీకృత సహజవాయువు రవాణా తిరిగి సాధారణ స్థితికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ‘నేచురల్ గ్యాస్ (సరఫరా నియంత్రణ) ఆర్డర్, 2026’ ను సవరించినట్లు తెలిపింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి మార్గంలో ఎల్ఎన్‌జీ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో సరఫరా సంస్థలు ‘ఫోర్స్ మేజర్’ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 9న కేంద్రం అత్యవసర నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశీయ గ్యాస్, దిగుమతి చేసుకున్న ఎల్ఎన్‌జీని గృహ అవసరాలు, రవాణా రంగం (సీఎన్‌జీ), ఎల్పీజీ ఉత్పత్తి, ఎరువుల కర్మాగారాల వంటి కీలక రంగాలకు మాత్రమే కేటాయించింది.
పెట్రోకెమికల్స్, విద్యుత్ ప్లాంట్ల వంటి ప్రాధాన్యత లేని రంగాలకు సరఫరాలో కోతలు విధించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అమలు, శాంతి చర్చలు జరుగుతుండటంతో పరిస్థితులు చక్కబడ్డాయని, సముద్ర మార్గంలో రవాణా సాధారణ స్థితికి చేరుకుందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందుకే అత్యవసర చర్యలు ఇక అవసరం లేదని పేర్కొంది. సంక్షోభ సమయంలో విధించిన మూడు అత్యవసర నిబంధనల్లో ఇది చివరిది.
ఇప్పటికే రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలన్న ఆదేశాలను, బల్క్ డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజా నిర్ణయంతో పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇతర వినియోగదారులపై ఒత్తిడి తగ్గనుంది. ఇకపై గ్యాస్ కేటాయింపులు సాధారణ వాణిజ్య ఒప్పందాల ప్రకారం కొనసాగుతాయి.

More Stories
డీజిల్ లో 15 శాతం ఐసోబ్యుటనాల్
టెలిగ్రామ్ పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్ తొలగించాల్సిందే
బద్రీనాథ్లోనూ కానుకల చోరీపై విచారణ