రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సభ్యుడు దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు విచారణకు యోగ్యం కాదని కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వాదనను బెంగళూరులోని ఒక ప్రత్యేక న్యాయస్థానం గత వారం తిరస్కరించింది. ఆర్‌ఎస్‌ఎస్ తప్పనిసరి సభ్యత్వ జాబితాలతో కూడిన నమోదిత సంస్థ కానందున, దాని వ్యక్తిగత సభ్యులకు పరువు నష్టం దావా వేయడానికి చట్టపరమైన అర్హత లేదని ఖర్గే వాదించారు.
జూన్ 27 నాటి తన ఉత్తర్వులో, “ఈ వాదన పూర్తిగా నిలవలేనిది, యోగ్యత లేనిది” అని పేర్కొంటూ న్యాయస్థానం ఈ వాదనను తోసిపుచ్చింది. ఖర్గే, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ హారిస్ నలపాడ్‌లపై ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ తేజస్ ఎ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసును ప్రత్యేక న్యాయమూర్తి సందీప్ పాటిల్ విచారణకు స్వీకరించారు.
జూలై 21న హాజరు కావాలని ఇద్దరు నాయకులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. అయితే, మాజీ మంత్రి దినేష్ గుండూ రావుపై ఉన్న ఫిర్యాదును న్యాయస్థానం కొట్టివేసింది. తేజస్ తాను ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడినని గానీ, స్వయంసేవకుడినని గానీ నిరూపించుకోవడానికి ఎలాంటి పత్రరూప సాక్ష్యాలను సమర్పించలేదని, అందువల్ల అతను ఫిర్యాదును కొనసాగించడానికి అర్హత ఉన్న ‘బాధితుడు’ కాదని ఖర్గే వాదించారు.
ప్రత్యేక న్యాయమూర్తి సందీప్ పాటిల్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ ప్రకటనలు, ప్రసంగాలు, చర్యలలో ఆర్‌ఎస్‌ఎస్‌కు, దానితో సంబంధం ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా అవమానకరమైన, పరువు తీసే, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు.
“నిందితులు ఒకే సమయంలో సమర్థించడం, ఖండించడం చేయడానికి అనుమతించలేము. ఒకవైపు, వారు ఆర్‌ఎస్‌ఎస్, దాని సభ్యులను ప్రస్తావిస్తూ తమ ప్రకటనలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు కేవలం ఫిర్యాదు కొనసాగకుండా చేయడానికి అటువంటి సభ్యుల ఉనికినే నిరాకరిస్తున్నారు,” అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
ఇంకా, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించే కార్యకలాపాలను అడ్డుకోవడానికి, పరిమితం చేయడానికి లేదా వాటిలో జోక్యం చేసుకోవడానికి నిందితులు ప్రయత్నించారనే వారి ప్రవర్తనే, అటువంటి కార్యకలాపాలలో పాల్గొని, వాటిని కొనసాగించే గుర్తించదగిన వ్యక్తులు ఉన్నారని స్పష్టం చేస్తోందని కోర్టు పేర్కొంది. కోర్టు తన ఉత్తర్వులో ఇలా పేర్కొంది: “అటువంటి వ్యక్తులను, వారి సామూహిక కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకున్నందున, తమ సంస్థలో ఏ సభ్యుడూ లేడని, తత్ఫలితంగా ఏ వ్యక్తి కూడా ఫిర్యాదు చేయలేడని నిందితులు ఇప్పుడు వాదించలేరు.”
ఆ ఉత్తర్వులో ఇంకా ఇలా జోడించారు: “ప్రస్తుత కేసులో, ఫిర్యాదు, ప్రమాణ స్వీకార వాంగ్మూలం ప్రకారం, నిందితులు 1, 3, ఆర్‌ఎస్‌ఎస్, దాని స్వయంసేవకులపై ఆరోపణలు చేశారని, ఫిర్యదుదారుడు తాను ఒక స్వయంసేవకుడినని, దానివల్ల తాను నష్టపోయానని పేర్కొంటున్నారని తెలుస్తోంది. ఈ వాదనలను యథాతథంగా పరిగణనలోకి తీసుకుంటే, సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద విచారణ కొనసాగించడానికి ఇవి ప్రాథమిక సాక్ష్యంగా సరిపోతాయి.”
ప్రత్యేక న్యాయస్థానం, మాతృభూమి, ఇలస్ట్రేటెడ్ వీక్లీ, ఇతరులు వర్సెస్ పి. గోపాలన్‌కుట్టి , మరొకరి కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అందులో ఆర్‌ఎస్‌ఎస్ ఒక నిర్దిష్టమైన, నిర్ణీతమైన, గుర్తించదగిన వ్యక్తుల సమూహమని, దాని సభ్యునికి పరువు నష్టం ఫిర్యాదు చేయడానికి అవసరమైన అర్హత (లోకస్ స్టాండీ) ఉంటుందని హైకోర్టు పేర్కొంది.
దీని తర్వాత కోర్టు ఇలా పేర్కొంది: “ఫిర్యాదుదారుడు అటువంటి నిర్దిష్టమైన, గుర్తించదగిన సంస్థలో సభ్యుడైనప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రకటనలో అతని వ్యక్తిగత పేరును ప్రత్యేకంగా ప్రస్తావించనంత మాత్రాన అతనికి ‘బాధితుడు’ అనే హోదాను నిరాకరించలేము. అటువంటి సభ్యునికి భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 356 కింద శిక్షార్హమైన నేరానికి సంబంధించి ఫిర్యాదును దాఖలు చేయడానికి, కొనసాగించడానికి తగినంత చట్టపరమైన ఆసక్తి,లోకస్ స్టాండీ (దావా వేసే అర్హత) ఉంటుంది.”
‘వ్యక్తి’ అనే పదాన్ని విస్తృతమైన, సమగ్రమైన రీతిలో నిర్వచించే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 2(26)ను ప్రస్తావిస్తూ. చట్టం ప్రకారం ఒక వ్యక్తుల సమూహాన్ని గుర్తించడానికి, అధికారిక సభ్యత్వం, రిజిస్ట్రేషన్, కార్పొరేషన్ లేదా అనుబంధానికి సంబంధించిన పత్రరూప రుజువు వంటి ఏ ఆవశ్యకతనూ శాసనం ముందస్తు షరతుగా నిర్దేశించలేదని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.
“పరువు నష్టం కేసులో విచారణ సారాంశం, ఆ సమూహం కార్పొరేట్‌గా నమోదు చేయబడిందా లేదా ప్రతి వ్యక్తి అధికారిక సభ్యత్వ కార్డును కలిగి ఉన్నారా? అనే దాని గురించి కాదు. కానీ ఎవరిపై పరువు నష్టం కలిగించే ఆరోపణ చేయబడిందో, ఆ సమూహం తగినంత స్పష్టమైన,గుర్తించదగిన సమూహంగా ఉందా లేదా అనే దాని గురించే” అని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.
ఫిర్యాదును కొనసాగించడానికి ఫిర్యాదుదారుడి యోగ్యతకు సంబంధించి ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుందని, అతను బాధితుడిగా పేర్కొనడానికి గల తన హోదా, అధికారం, ప్రాతినిధ్య సామర్థ్యం లేదా మరే ఇతర ఆధారానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించడానికి అతనికి అవకాశం ఇచ్చిన తర్వాతే దానిని సముచితంగా పరిగణించవచ్చని ధర్మాసనం తన ఉత్తర్వులో స్పష్టం చేసింది.
“పరువు నష్టం కలిగించాలనే ఉద్దేశం లేదు” అనే వాదన కూడా విచారణ సమయంలో సాక్ష్యం, తీర్పు అవసరమయ్యే విషయమేనని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడు అవసరమైన ఉద్దేశంతో, జ్ఞానంతో, దురుద్దేశంతో, లేదా సదుద్దేశంతో వ్యవహరించాడా లేదా అనే ప్రశ్నను ఇరుపక్షాలు సాక్ష్యాలు సమర్పించిన తర్వాత మాత్రమే నిశ్చయంగా నిర్ధారించవచ్చు.”
న్యాయస్థానం తన ఉత్తర్వులో ఇలా పేర్కొంది: “ప్రాథమికంగా, ఒక వ్యక్తి కేవలం ఆరాధకుడికి లేదా అభిమానికి, ఒక వ్యవస్థీకృత సంస్థలో సభ్యుడిగా, కార్యకర్తగా, లేదా స్వయంసేవకుడిగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంది. ఒక ప్రముఖ వ్యక్తి అభిమానికి, ఆ వ్యక్తి వ్యవహారాలు, కార్యకలాపాలు, లక్ష్యాలు లేదా పనితీరుతో ఎటువంటి గుర్తింపు పొందిన సంబంధం ఉండకపోవచ్చు. మరోవైపు, పైన పేర్కొన్న విధంగా, ఒక స్వయంసేవకుడు లేదా సభ్యుడు ఆ సంస్థ కార్యకలాపాలు, లక్ష్యాలతో తనకు అనుబంధం ఉందని, వాటిలో తన భాగస్వామ్యం ఉందని నొక్కి చెబుతాడు.”
ఆ తర్వాత న్యాయస్థానం ఇలా పేర్కొంది: “ఈ ప్రాథమిక దశలో, ఒక ప్రముఖ వ్యక్తిపై పరువు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఒక అభిమాని కేసు పెట్టడంతో పోల్చి మాత్రమే ఈ ఫిర్యాదును తిరస్కరించడం తొందరపాటు అవుతుంది. ఫిర్యాదుదారునికి, ఆ సంస్థతో తనకున్న అనుబంధ స్వభావాన్ని, దానికి సంబంధించిన హక్కులు మరియు బాధ్యతలను నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలి.”

More Stories
పురుషుల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ విధానాలతోనే పశ్చిమాసియా సంక్షోభం నుండి గట్టెక్కాం
అయోధ్యలో విరాళాల చోరీపై మోహన్ భగవత్ `రామ్-రామ్’