1998లో తాను స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీలో చీలిక ముంచుకొస్తున్న తరుణంలో, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనను అడ్డుకోవాలంటే తన ప్రత్యర్థులు తనను “చంపాల్సిందే” అని స్పష్టం చేశారు. టిఎంసి పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలు చంద్రిమ భట్టాచార్య రాజీనామా చేసిన కొద్ది గంటల తర్వాత, అలాగే రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు మమతా బెనర్జీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
బీజేపీ ముందు తాను ఎప్పటికీ తలవంచబోనని ఆమె స్పష్టం చేశారు. “నేను బీజేపీ ముందు తలవంచను, అలాగే నా పార్టీ కూడా ఎలాంటి ఒత్తిడికీ తలవంచదు,” అని మమత తేల్చి చెప్పారు. అయితే, పార్టీ పదవులకు రాజీనామా చేయడానికి గల అసలు కారణాన్ని చంద్రిమ తనకు ముందే చెప్పారని మమతా బెనర్జీ తెలిపారు.
“చంద్రిమ భట్టాచార్య ఈ రోజు రాజీనామా చేశారు. ఆమె కుమారుడు గతంలోనే తృణమూల్ వ్యతిరేక వర్గంతో చేతులు కలిపినందున, తాను రాజీనామా చేయాల్సి వస్తుందన్న అసలు పరిస్థితిని ఆమె నాకు ముందే తెలియజేశారు,” అని మమతా బెనర్జీ చెప్పారు. పార్టీ కార్యాలయాన్ని అసమ్మతి వర్గం స్వాధీనం చేసుకోవడంపై స్పందిస్తూ, టిఎంసి భవన్ అనేది ‘మా, మట్టి, మనుషుల’ స్తి అని, దానిని ఎవరూ బలవంతంగా స్వాధీనం చేసుకోలేరని ఆమె స్పష్టం చేశారు.
“నిన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి దానికి తాళం వేసిన వారికి నేను చెప్పేది ఒక్కటే: ఆ కార్యాలయాన్ని మేము అద్దెకు తీసుకున్నాము. అక్టోబర్ 2027 వరకు అది మాకు లీజులో ఉంది. ఒక వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళవచ్చు, కానీ ఆ సంస్థ ఉనికి కోల్పోదు. అది పార్టీ ఆస్తి. నేను దానిని నా సొంతం చేసుకోలేను. ‘మా, మట్టి, మనుషుల’ ఆస్తిని ఎవరూ బలవంతంగా స్వాధీనం చేసుకోలేరు,” అని ఆమె పెక్రోన్నారు.
తమకు “రాజకీయ గుర్తింపు”నిచ్చిన పార్టీకే అసమ్మతివాదులు “ద్రోహం” చేశారని బెనర్జీ విమర్శించారు, అలాగే వారు బహిరంగంగానే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. “మీకు రాజకీయ గుర్తింపునిచ్చిన పార్టీకే మీరు ద్రోహం చేశారు. ఇప్పుడు మీరు బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే, వెళ్లి అధికారికంగా బీజేపీలో చేరండి” అని సవాల్ చేశారు.
“మీరేమనుకుంటున్నారు? నేను చనిపోయానని అనుకుంటున్నారా? పార్టీ గుర్తు మీకు దక్కే అవకాశాలు చాలా తక్కువని మాకు తెలుసు. నేను ఈ గుర్తుతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, మీరు నా గొంతును నొక్కగలరా?” అని ఆమె ప్రశ్నించారు.

More Stories
సృష్టి ఆరంభం నుంచి మాతృత్వం అనే పునాదిపైనే ప్రపంచం
పేపర్ లీక్పై 303 మిలియన్ల వ్యూస్ ప్రధాని మోదీ ఇన్స్టా రీల్ రికార్డు
విద్యార్థుల మనోభావాలను రాజకీయంగా `హైజాక్’ చేస్తున్న ప్రతిపక్షాలు