ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జపాన్ ప్రధాని సనాయే తకైచీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 120కి పైగా వ్యాపార ఒప్పందాల ద్వారా భారతదేశానికి 10 బిలియన్ డాలర్ల జపాన్ పెట్టుబడులు వస్తాయని తెలిపారు. జపాన్ నుండి భారతదేశానికి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను ఆకర్షించడం, రాబోయే దశాబ్దంలో భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
రక్షణ రంగంలో సహ-అభివృద్ధికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లోహాలు, ఇంధన రంగాలలో తమ సహకారాన్ని పెంపొందించుకోవడానికి కూడా వారు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ రంగాల్లో కుదిరిన ఒప్పందాల ద్వారా, ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా దోహదం చేస్తాయని తెలిపారు.
జపాన్ ప్రధాని సనాయ్ తకైచీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని “భారత్-జపాన్ పెట్టుబడి భాగస్వామ్యం క్రమంగా బలపడుతోంది. గత ఏడాది కాలంలో, సుమారు 120 కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయి, ఇవి 10 బిలియన్ డాలర్లకు పైగా జపాన్ పెట్టుబడులను భారతదేశానికి తీసుకువస్తాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీల మధ్య నేడు కుదిరిన ఒప్పందం, మూలధనం, పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత సులభతరం చేస్తుంది” అని చెప్పారు.
“మా లక్ష్యం స్పష్టం జపాన్ నుండి భారతదేశానికి 10 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులను ఆకర్షించడం, రాబోయే దశాబ్దంలో భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడం. భారతదేశంలో నిరంతర సంస్కరణలు వ్యాపారం చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచాయి, ఇది జపాన్ కంపెనీలు కూడా సద్వినియోగం చేసుకోగల అవకాశం…” అని తెలిపారు.
16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చిన తకైచీకి సాదర స్వాగతం పలుకుతూ, మోదీ ఆమెను “దూరదృష్టి గల, ప్రజాదరణ పొందిన నాయకురాలు” అని ప్రశంసించారు. ఆమెను తన “చెల్లెలు” అని పేర్కొంటూ, జపాన్‌లోని నారా ప్రిఫెక్చర్‌కు ఆమె చెందిన విషయాన్ని కూడా మోదీ కొనియాడారు. అక్కడ “భారతదేశంలో బౌద్ధులు ఉన్నారు” అని ఆయన పేర్కొన్నారు.
“ఆర్థిక భద్రత కోసం మేమిప్పుడు ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం. దీని ద్వారా, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, అధునాతన మెటీరియల్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో సరఫరా గొలుసు స్థితిస్థాపకతను బలోపేతం చేస్తాం. అలాగే, నేటి అనిశ్చిత యుగంలో, ఆర్థిక, ఇంధన భద్రత ప్రాముఖ్యతను భారత్, జపాన్ దేశాలు పూర్తిగా అర్థం చేసుకున్నాయి” అని మోదీ తెలిపారు.
:దేశం అంతటా 1000 బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల ప్లాంట్లను స్థాపించడంలో భారత్- జపాన్ బయోగ్యాస్ చొరవ మాకు సహాయపడుతుంది. ఇది మా ‘గోబర్‌ధన్’ చొరవను మరింత బలోపేతం చేస్తుంది. గ్రామాల్లో సుస్థిరత, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త ఊపునిస్తుంది” అని మోదీ వివరించారు.
మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచ కూటముల మార్పులపై స్పందిస్తూ, న్యూఢిల్లీ, టోక్యోల మధ్య ఉన్న గాఢమైన సంబంధం దృఢంగా కొనసాగుతోందని మోదీ పునరుద్ఘాటించారు. “కొన్ని రోజుల క్రితం జీ7 శిఖరాగ్ర సమావేశంలో నేను చెప్పాను. నేటి ప్రపంచ సంక్షోభ వాతావరణంలో పరస్పర విశ్వాసమే మన అతిపెద్ద వ్యూహాత్మక ఆస్తి అని. ఈ గీటురాయిపై భారత్-జపాన్ భాగస్వామ్యం సంపూర్ణంగా పరీక్షించబడటం నాకు గర్వంగా ఉంది,” అని ఆయన చెప్పారు.

More Stories
న్యాయ ప్రక్రియలో ఏఐ సృష్టించే పత్రాలపై `జీరో’ సహనం
పాక్ లో 125 ఏళ్ల నాటి సిక్కు గురుద్వారా కూల్చివేత.. భారత్ ఆగ్రహం
జూన్‌లో అతి తక్కువ వర్షపాతంతో వ్యవసాయంకు ముప్పు