యాదాద్రి బోర్డు ఏర్పాటుతో మరోసారి అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ వివాదం తెరపైకి వచ్చింది. పదవుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలను, సొంత పార్టీ నేతలను పక్కనబెట్టి.. ఎవరికో పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యులను నియమించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టు బోర్డును ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బిఆర్ఎస్ మాజీ ఎంపీ సోదరుడైన ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్, ఎండీ మన్నె సత్యనారాయణరెడ్డి వ్యాపారవేత్త ఎంఎస్‌ఎన్ రెడ్డిని చైర్మన్‌గా మరో 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటుచేసింది. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్‌రెడ్డితోపాటు నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ కుమారుడు విజయేందర్‌గౌడ్‌లను సభ్యులుగా నియమించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
ఇప్పటికే మంత్రుగా ఉండగా, కొడుకు ఎంపీగా కొనసాగుతుండగా గడ్డం వినోద్ వెంకటస్వామిని ఈ బోర్డులో సభ్యునిగా చేయడం పట్ల కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. “యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అంతా ఏకపక్షం. నా నియోజకవర్గమైన మునుగోడు ఆలయం ఉన్న యాదాద్రి జిల్లాలోకే వస్తుంది. అయినా కనీసం నన్ను సంప్రదించలేదు” అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతా కొత్త వాళ్లదే హవా నడుస్తున్నదని, అసలు కాంగ్రెస్ వారు ఎక్కడ? అంటూ నర్మగర్భ విమర్శలు గుప్పించారు.
ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లు, ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లందరూ పార్టీలో రోజురోజుకూ కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరూ సీనియర్ నేతలే ఉన్నారు కానీ, పార్టీని ఎట్లా నడుపాలో తెల్వదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయకుండా, షో ఆఫ్ చేస్తే ఎలా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తేనే ప్రజలకు నచ్చుతుందని హితవు పలికారు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సమర్థించడం సంచలనంగా మారింది. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బోర్డు సభ్యుల నియామకం జరిగినట్టు తెలిపారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా ఆ జిల్లా నేతలతో చర్చించాలనే అంశంపై తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ట్రస్ట్ బోర్డులో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని నియమించడమేమిటని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరైన కొణిదెల సురేఖను గుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించడమేమిటని ఆమె ప్రశ్నించారు.
ఆంధ్రా పాలకుల చేతిలో సీఎం పావులా ఉన్నట్లు తాజా ఘటనతో మరోమారు స్పష్టమైందని ఆమె ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక సేవలు చేసే వారిని ట్రస్ట్ బోర్డులో నియమించాల్సి ఉంటుందని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఇందుకు భిన్నంగా వ్యాపారులకు అవకాశం కల్పించారని ఆమె మండిపడ్డారు. ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆరుగురిని సభ్యులుగా ఎన్నుకొనే ఆనవాయితీ కొనసాగుతున్నదని పేర్కొంటూ వెంటనే బోర్డులో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురిని తీసుకోవాలని, అందులో యాదగిరిగుట్టకు చెందిన ఒకరికి అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

More Stories
జూన్‌లో అతి తక్కువ వర్షపాతంతో వ్యవసాయంకు ముప్పు
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం!
ఆచారాలు పాటించకపోతే హిందూ వివాహం చెల్లదు