కరాచీ ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలపై మండిపాటు

 
పాకిస్థాన్‌లోని కరాచీలో ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో నలుగురు సైనికులు మృతి చెందిన ఉగ్రదాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.  ఇతర దేశాలపై వేలెత్తి చూపే బదులు, పాకిస్థాన్ తన భూభాగంలో పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన హితవు చెప్పారు. 
ఈ ఘటన వెనుక భారత శక్తుల ప్రమేయం ఉందని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మెహిసిన్ నక్వీ ఆరోపించారు. నక్వీ ఆరోపణలపై స్పందించిన రణదీర్ పాక్ చురకలంటించారు. “ఇటువంటి వితండవాదాన్ని పాక్ మానుకోవాలి. ముందు ఈ దేశం తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ నేలపై ఉన్న ఉగ్రవాద కార్యలాపాల స్థావరాలను ముందుగా నిర్మూలించాల్సి ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి చివరికి ఈ విధంగా విద్రోహ చర్యలకు పాక్ వేదిక అవుతోంది” అని పేర్కొన్నారు. 

భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ ఇతరులపై నిందలు వేయడం కంటే పాకిస్థాన్ తనలో తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించేందుకు విశ్వసనీయ చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించే ధోరణిని విడనాడాలని మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా, శనివారం రాత్రి కరాచీలోని సింధ్ రేంజర్స్ భిట్టాయ్ వింగ్ ప్రధాన కార్యాలయంపై భారీ ఉగ్రదాడి జరిగింది. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఆయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు వాహనాన్ని ప్రధాన గేటుకు ఢీకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. అనంతరం గ్రెనేడ్లు విసురుతూ కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఉగ్రవాదుల దాడికి రేంజర్స్ సిబ్బంది వెంటనే ప్రతిదాడి ప్రారంభించారు. అనంతరం స్పెషల్ సెక్యూరిటీ యూనిట్ (ఎస్‌ఎస్‌యూ), యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్ (ఏటీఎఫ్) కమాండోలు రంగంలోకి దిగడంతో సుమారు 90 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో గాయపడిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.