సౌదీలో అరాంకో హెలికాప్టర్ కూలి 14 మంది మృతి

సౌదీలో అరాంకో హెలికాప్టర్ కూలి 14 మంది మృతి
సౌదీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ ఆయిల్ సంస్థ అరాంకోకు చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మంది మరణించారు. మృతులంతా సౌదీకి చెందిన వారే. ఈ ఘటన సౌదీ అరేబియా ఉత్తర తీరంలోని రస్ తనూరాలో ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై అరాంకో సంస్థ ఇంకా స్పందించలేదు.

హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనకు, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై సౌదీ చమురు మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. సౌదీకి చెందిన చమురు సంస్థ అరాంకో 1934 నుంచి విమానయాన సేవలు కూడా అందిస్తోంది. 

2023 నుంచి దీనికి సంబంధించిన సంస్థ పేరును అలౌలా ఏవియేషన్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ సంస్థకు విమానాలు, హెలికాప్టర్లు వంటివి కలిపి 60 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో తీర ప్రాంత రవాణా సేవలు, సరుకుల రవాణా, వైద్య పరమైన తరలింపు సేవలను సంస్త నిర్వహిస్తోంది. ఈ హెలికాప్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ‘అరామ్‌కో’కు చెందినదని, ఈ సంస్థలో సౌదీ అరేబియాకు అత్యధిక వాటా ఉందని సమాచారం.

ఈ ప్రమాదం జరిగిన రాస్ తనూరా ప్రాంతం, పశ్చిమాసియాలోనే అత్యంత పెద్దదైన చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటిగా తెలుస్తోంది. ఇది రోజుకు 5,50,000 బారెళ్ల చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉందని సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత అనంతరం, సౌదీ సహా గల్ఫ్ దేశాలు తమ చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా ఆదివారం ఉదయం 11.00 గంటలకు విమాన ప్రమాదం జరిగింది.  సాహస క్రీడ అయిన స్కైడైవింగ్‌లో శిక్షణ ఇస్తున్న ఒక చిన్న ప్రైవేట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లోంచి ఒక్కసారిగా కిందికి దూసుకువచ్చి కుప్పకూలిపోయింది. ఈ భీకర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న పైలట్‌తో పాటు ఐదుగురు స్కైడైవింగ్ విద్యార్థులు, వారికి శిక్షణ ఇస్తున్న ఐదుగురు శిక్షకులు సహా మొత్తం 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.