లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

లండన్‌లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. తన గదిలో జూన్ 23న ఉదయం అతడి మృతదేహాన్ని స్నేహితులు గుర్తించారు. అయితే, అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి పేరు శ్రీనాథ్ రెడ్డి. కామారెడ్డి జిల్లా, రాజంపేట మండలం, తలమడ్ల గ్రామంలోని మధుసూధన్ రెడ్డి తనయుడు. 

14 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు శ్రీనాథ్ రెడ్డి లండన్ వెళ్లాడు. అక్కడ స్నేహితులతో ఉంటున్నాడు. ఈ నెల 22న రాత్రి చివరిసారిగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అదే రోజు రాత్రి మరణించాడు. జూన్ 23న ఉదయం అతడి మరణించి ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. శ్రీనాథ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి రూమ్‌మేట్స్ అంటున్నారు. 
 
అయితే, శ్రీనాథ్ రెడ్డి మరణంపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు ముందు రోజు రాత్రే తమకు ఫోన్ చేసి మాట్లాడాడని, ఎప్పట్లాగే చాలా మామూలుగా మాట్లాడాడని అంటున్నారు. ఆ రోజు రాత్రి తన స్నేహితుల బర్త్ డే పార్టీకి హాజరయ్యాడని చెప్పారు. ఆ మరుసటి రోజే అతడు మరణించినట్లు తమకు కబురందిందని తెలిపారు. 
 
ముందురోజు రాత్రి చాలా మామూలుగా మాట్లాడిన వ్యక్తి ఎలా ఆత్మహత్యకు పాల్పడుతారని వారు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల శ్రీనాథ్ రెడ్డిది హత్యా? ఆత్మహత్యా? అన్నది తేల్చాలని కోరుతున్నారు. ఈ విషయంలో తమకు తెలంగాణ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని విన్నవించారు. శ్రీనాథ్ మరణంపై ఉన్న అనుమానాలు నిగ్గుతేల్చాలని కోరుతున్నారు.