పదో తరగతి వరకు నచ్చిన విదేశీ భాషను చదువుకోవచ్చు 

పదో తరగతి వరకు నచ్చిన విదేశీ భాషను చదువుకోవచ్చు 
లక్షలాది మంది విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలిగించేలా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది. ‘మూడు భాషల విధానం’ కింద ప్రస్తుతం 7 నుండి 9వ తరగతుల్లో చదువుతూ, రెండు విదేశీ భాషలను ఎంచుకున్న విద్యార్థులు 10వ తరగతి వరకు తమ ప్రస్తుత భాషా విధానాన్నే కొనసాగించడానికి అనుమతీస్తారు. 
 
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి) 2020కి అనుగుణంగా, జూలై 1 నుండి 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు కనీసం రెండు భారతీయ భాషలతో సహా మొత్తం మూడు భాషలను తప్పనిసరిగా చదవాలని  సీబీఎస్‌ఈ ప్రకటించిన ఒక నెల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. సవరించిన భాషా విధానాన్ని గత తేదీ నుండి వర్తింపజేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు మే 15 నాటి సర్క్యులర్‌ను కోర్టులో సవాలు చేశారు. 

ఈ సవరించిన నిబంధన కేవలం భవిష్యత్తులో చేరే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని సీబీఎస్‌ఈకి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. “కొత్త భాషా విధానం ప్రకారం కనీసం రెండు భారతీయ భాషలను అభ్యసించాలనే నిబంధన, 6వ తరగతి నుండి భవిష్యత్తులో అమలు చేయబడుతుంది. అంతే తప్ప, ప్రస్తుతం 7 నుండి 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది గత తేదీ నుండి వర్తించదు,” అని ఆ అధికారి వివరణ ఇచ్చారు.

7-9 తరగతి విద్యార్థులు ఇప్పటికే అభ్యసిస్తున్న విదేశీ భాషలను రెండు సబ్జెక్టులుగా కొనసాగించవచ్చని తెలిపింది.  గతంలో అమలైన విధానం ప్రకారం విద్యార్థులు రెండు విదేశీ భాషలను ఎంచుకునే సౌకర్యం ఉండేది. భారతీయ భాష తప్పనిసరి కాదు. దీంతో కొందరు విద్యార్థులు రెండూ విదేశీ భాషల్నే ఎంచుకున్నారు.  ఇంకొందరు ఒక విదేశీ భాష, ఒక భారతీయ భాష చదువుకునే వారు. కానీ, సీబీఎస్‌ఈ బోర్డు కొత్తగా తెచ్చిన త్రిభాషా విధానం ప్రకారం ఏదైనా ఒక్క విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవచ్చు. 

ఈ ఏడాది నుంచి త్రిభాషా విధానం అమలవుతోంది. దీన్ని ప్రస్తుతం తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి అమలు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది.  అంటే, గత ఏడాది ఎనిమిదో తరగతి వరకు రెండు విదేశీ భాషలు చదువుకున్న వారు ఇప్పుడు తొమ్మిదో తరగతికి రాగానే ఒక విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగిలిన రెండు భారతీయ భాషలు చదవాలి. 
ఈ నిర్ణయం ప్రకారం గతంలో వారు చదివిన రెండు విదేశీ భాషల్లో ఒకటి వృథా అవుతుంది. ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.  ఇంతకాలం తాము చదివిన రెండు భాషలకు అర్థం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమర్శించారు. మళ్లీ కొత్త భాష నేర్చుకోవడం ఇబ్బంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు తాజా ఆదేశాలు జారీ చేసింది.