జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) నిర్వహించిన 14వ పరీక్షను రద్దు చేయడంతో సహా తమ అన్ని డిమాండ్లను అంగీకరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి నాయకులు స్పష్టం చేయగా, ఆందోళన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో మొదటి విడత అధికారిక చర్చలు జరిపిన జార్ఖండ్ ప్రభుత్వం వారి డిమాండ్లను “సానుకూల దృక్పథంతో” పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
జేపీఎస్‌సీ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నిరసనలు 14వ రోజుకు చేరుకున్న తరుణంలో, శుక్రవారం సాయంత్రం రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో విద్యార్థి ప్రతినిధులతో ప్రభుత్వం తొలివిడత చర్చలు జరిపింది. ఇదే సమయంలో, విచారణ నిమిత్తం జేపీఎస్‌సీకి చెందిన ముగ్గురు ప్రస్తుత సభ్యులకు రాష్ట్ర సిఐడి సమన్లు జారీ చేసింది.
సమావేశం అనంతరం జార్ఖండ్ ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం శ్రద్ధగా విన్నదని తెలిపారు. “మేము ఆందోళన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాము. వారి డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. వాటిని సానుకూల దృక్పథంతో పరిశీలించడానికి సిద్ధంగా ఉంది,” అని కుమార్ పేర్కొన్నారు.
విద్యార్థుల నిరసన కార్యక్రమ ప్రతినిధి పియూష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “ఈ రోజు చర్చలు సానుకూలంగా సాగాయి. మేము మా డిమాండ్లన్నింటినీ తెలియజేశాము. తదుపరి విడత చర్చలు కూడా జరుగుతాయి. ప్రస్తుతానికి నిరసన కొనసాగుతుంది,” అని చెప్పారు. మరో విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ, “చాలా సానుకూలమైన చర్చ జరిగింది. ఇది చర్చలలో మొదటి దశ మాత్రమే,” అని తెలిపారు.
ఇరువర్గాలు చర్చలు సానుకూలంగా జరిగాయని పేర్కొన్నప్పటికీ, తమ ఉద్యమం కొనసాగుతుందని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం నాటికి తమ డిమాండ్లు నెరవేరకపోతే, ఆగస్టు 10న రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లాలని విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఇలా ఉండగా, పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) అధ్యక్షురాలు నేహా బోరాపై సిరా దాడి జరిగింది. రాంచీలోని జార్ఖండ్ అసెంబ్లీ వైపుగా విద్యార్థులతో కలిసి నిరసన ర్యాలీగా వెళ్తున్న ఆమెపై ఒక వ్యక్తి ఇంకు పోశాడు. ‘నేహా బోరా ఉమర్ ఖలీద్ మద్దతుదారురాలు. ఆమె అంటే ఇష్టం నాకు లేదు. ఆమె దేశ వ్యతిరేకి’ అని మీడియాతో పేర్కొన్నాడు. ‘ఢిల్లీ నిరసనల సమయంలో పెల్లెట్ గన్ కాల్పులు, లాఠీచార్జిని ఎదుర్కొన్న నాకు, సిరా చల్లడం వల్ల భయం కలగదు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత ఆగ్రహాన్ని సిరాతో అణచివేయగలమని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు.

More Stories
హాలీవుడ్ కంటే భారీగా 59 వేల స్క్రీన్లలో విడుదల కానున్న ‘రామాయణం’
జార్ఖండ్ నిరాహారదీక్షలో ఒకరు ఆసుపత్రికి .. చర్చలకు సీఎం ఆహ్వానం
ఆందోళన వద్దు, నేను మీతో ఉన్నా.. రెబెల్ ఎంపీలకు మోదీ భరోసా