తుంగభద్ర నీటి వాటాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 

తుంగభద్ర నీటి వాటాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 
తుంగభద్ర నది గేట్ల రిపేర్ల వ్యవహారాన్ని బీజేపీ స్వాగతిస్తోందని, అయితే నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రతిపాదించిన నవేలి రిజర్వాయర్ (35 టీఎంసీలు), ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్రేవల ప్రాజెక్ట్ (20 టీఎంసీలు) వల్ల తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటా దెబ్బతిని కేవలం 5 టీఎంసీలు మాత్రమే వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఏం మాట్లాడారో, రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీలు తెచ్చారో ప్రజల ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల విషయంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ (కేసీఆర్ ప్రభుత్వం) రెండు కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని ఆయన గుర్తు చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్రాల మధ్య వివాదాల్లో మధ్యవర్తిగా ఉండి సమస్యలను పరిష్కరించడానికే ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, ఎన్‌ఆర్‌సీ,  పౌరసత్వ సవరణ చట్టం  అంశాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సమాజంలో ధ్రువీకరణ తెచ్చేందుకు నాటకాలు ఆడుతున్నాయని రామచందర్ రావు మండిపడ్డారు. 
 
2013 బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాదని, 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారతీయుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు.  ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదు ప్రక్రియలో ఆధారాల కోసం నిర్దేశించిన 12 రకాల పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటి మాత్రమేనని, చట్టాలు చదువుకున్న బారిస్టర్ అయిన ఒవైసీ ప్రజలను తప్పుదారి పట్టించడం తగదని ఆయన హితవు పలికారు. 
 
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయభ్రాంతులు సృష్టించవద్దని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను హెచ్చరించారు.