* రేవంత్ కు స్పష్టం చేసిన అశ్వని వైష్ణవ్ .. మంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణల పట్ల ఆగ్రహం
మెట్రోరైల్ ఫేజ్-2 అనుమతులు, పెండింగ్ నిధుల విషయంలో రైల్వే శాఖ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతోనే తేల్చుకోవాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ సమస్యలపై చర్చించేందుకు అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ముగ్గురి మధ్యా దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి.
అంతిమంగా జపాన్ నుంచి నేరుగా రుణం వచ్చిందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటూ రేవంత్‌ను భేటీలోనే కడిగిపారేసినట్టు తెలిసింది. దానితో అక్కడి నుంచి బేలగా బయటకు వచ్చిన సీఎం, మంగళవారం కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌ను కలువనున్నట్టు తెలిసింది. పైగా, కేంద్ర మంత్రులతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
‘కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం వేర్వేరు కాదు. మీరు కిషన్ రెడ్డిని తిడుతూ కేంద్రం వద్ద సహాయం ఎలా అడుగుతారు? మెట్రోపై మీకసలు చిత్తశుద్ధి లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారా? ఖట్టర్‌ను కలవండి. అంతా ఒకే అనుకుంటే అప్పుడు చూద్దాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్తతో విసురుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చివరకు ఒక్కటిగా వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆదివారం రాత్రి కలిశారు. ఈ సమావేశం అపాయింట్మెంట్ కూడా సికింద్రాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డే తీసుకున్నారు.
మెట్రో రుణం బదిలీ, రెండో దశ విస్తరణ.. ఈ రెండు అంశాలపై ఇద్దరు నేతలు మంగళవారం పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. జపాన్ ప్రభుత్వం సహకరిస్తామని చెప్తున్నా వారితో ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం రేవంత్ అసమర్థత, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్‌కు నిదర్శనం కాదా? అని కేంద్రం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆపేశారని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్‌ఎఫ్‌సీ) ఖాతాలో జమయిన రూ.13,600 కోట్లను రాష్ట్రప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని గత వారం సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎ రేవంత్ భేటీకి తాను కూడా వస్తానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ రెండుసార్లు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి ఢిల్లీకి రాగా, కిషన్‌రెడ్డి రైల్వే మంత్రి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సానుకూల చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
రైల్వే శాఖ మంత్రితో బేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రోకు ఐఆర్‌ఎఫ్‌సి నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంగళవారం ఉదయం భేటీ అవుతామని సిఎం వెల్లడించారు.
రెండు ప్రత్యామ్నాయాలు సూచించిన కేంద్రం
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-1కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చామని, కానీ.. ఫేజ్-1, ఫేజ్-2 విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరు తన అసమర్థ విధానాలను ప్రతిబింబిస్తున్నదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫేజ్-2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ చొరవ తీసుకొని రెండు ప్రత్యామ్నాయాలను సూచించినట్టు తెలిపింది.
రూ.10 వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా ఆర్‌ఆర్‌టీఎస్ ఫార్ములాను సూచించామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపింది. రాష్ట్రం చెప్పిన ఫార్ములా ప్రకారం సహకరించేందుకు అంగీకరించినా రేవంత్ ఎందుకు అసహనం ప్రదర్శిస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నది.
ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో అనేకసార్లు మార్పులు చేస్తున్నా, డీపీఆర్ సరిగ్గా సమర్పించకపోయినా వాటిని స్వీకరిస్తూ రాష్ర్టానికి నిర్మాణాత్మక సలహాలు, సహకారాన్ని అందించామని కేంద్రం వెల్లడించింది. అయినా సీఎం రేవంత్‌రెడ్డి ఐఆర్‌ఎఫ్‌సీ గురించి, ఎల్‌అండ్‌టీ-ఐఆర్‌ఎఫ్‌సీ ఒప్పందం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, జపాన్ ప్రభుత్వం నుంచి మెట్రో ప్రాజెక్టుకు నేరుగా రుణం వచ్చిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని కేంద్రం కడిగిపారేసినట్టు తెలిసింది.
More Stories
ఎన్డీయే వైపు మొగ్గు చూపుతున్న శరద్ పవార్
మానవ హిత ఉపాధి దిశగా కృషి చేయాలి
ఈ20 ఇంజన్లను దెబ్బతీస్తుందనడానికి ఆధారాలు లేవు