బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

బాసర అమ్మవారి ఆలయంలో భారీ చోరీ

తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ ప్రాంగణంలో ఘోర భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఆలయ పరిధిలోని మొదటి అంతస్తులో కొలువై ఉన్న అనుబంధ ఆలయమైన మహంకాళి అమ్మవారి గుడిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. 

అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ వెనుక వైపు నుంచి చొరబడిన దొంగలు, మహంకాళి అమ్మవారి గర్భాలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అమ్మవారి అలంకరణలో ఉన్న వెండి కిరీటంతో పాటు, భక్తులు సమర్పించిన కానుకల హుండీని కూడా ఎత్తుకెళ్లడం స్థానికంగా, భక్తులలో తీవ్ర సంచలనం సృష్టించింది. 

మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గుడికి వచ్చిన సందర్భంగా తాళాలు పగులగొట్టి ఉండటం గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ పూజారి చేత తలుపులు తెరిపించారు. 

ఆ సమయంలో అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు హుండీని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలపై వస్త్రాలు కప్పి దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చోరీకి పాల్పడిన హుండీలో నుంచి డబ్బులు తీసుకుని, తర్వాత హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

బాసర ఆలయంలో చోరీ గురించి సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఘటనాస్థలిని పరిశీలించారు. చోరీ జరిగిన తీరు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమావేశమయ్యారు. కేసును అన్ని కోణాల్లో విచారించి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిందితుల వేలిముద్రలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.  

అయితే, రాత్రి వేళల్లో ఆలయ సంరక్షణ కోసం ఏకంగా ఆరుగురు హోంగార్డులు విధుల్లో ఉన్నప్పటికీ దొంగలు ఇంత సులభంగా లోపలికి వచ్చి చోరీకి పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో, పోలీసులు ఆ సమయంలో విధుల్లో ఉన్న హోంగార్డులను కూడా విచారిస్తున్నారు.