టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్‌ రీటెస్ట్ పేపర్లు అమ్మకం.. విద్యార్థి అరెస్ట్‌

టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్‌ రీటెస్ట్ పేపర్లు అమ్మకం.. విద్యార్థి అరెస్ట్‌
ఒక విద్యార్థి టెలిగ్రామ్ ద్వారా ఫేక్ నీట్‌ రీటెస్ట్ పేపర్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు నిఘా సమాచారం అందడంతో అతడి ఇంటిపై దాడి చేసి ఆ యువకుడిని అరెస్ట్‌ చేశారు. నీట్‌ రీటెస్ట్‌కు రెండు రోజుల ముందు ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది. రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఆకాష్ చౌదరి ‘పేపర్ మాఫియా’ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నీట్‌ రీటెస్ట్‌కు సంబంధించిన నకిలీ ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నాడు. 
 
నీట్ ప్రిపరేషన్ బుక్స్‌లోని పేజీలను స్కాన్ చేసి, వాటిని అసలైన పరీక్ష పత్రాలుగా చెలామణి చేస్తున్నాడు. ఒక్కో పేపర్‌కు అభ్యర్థుల నుంచి రూ. 4,000 వసూలు చేసి క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్వీకరించినట్లు సమాచారం. అలాగే తన గుర్తింపును దాచేందుకు అమెరికాకు చెందిన వీపీఎన్, ప్రాక్సీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఈ టెలిగ్రామ్ ఛానల్‌ను అతడు నిర్వహిస్తున్నాడు.

కాగా, నీట్‌ పేపర్ లీక్‌కు సంబంధించిన అనుమానాస్పద సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రాజస్థాన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు నిఘా సమాచారం అందింది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున భిల్వారాలోని పటేల్ నగర్‌లో నివసిస్తున్న ఆ విద్యార్థి ఇంటిపై పోలీసులు రైడ్‌ చేశారు. నిందితుడైన 19 ఏళ్ల ఆకాష్ చౌదరిని అరెస్ట్‌ చేశారు.

నిందితుడి నుంచి ఒక మొబైల్ ఫోన్, నీట్ స్టడీ మెటీరియల్, పలు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోసం, నకిలీ పరీక్ష పత్రాల విక్రయం, ఐటీ చట్టం, పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అతడి బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ ఫుట్‌ప్రింట్, ఇతర మోసాల నెట్‌వర్క్‌తో అతడికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు భిల్వారాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆకాష్, పోటీ పరీక్షలకు సన్నద్ధత కోసం జైపూర్‌ వెళ్లాడని పోలీస్‌ అధికారి తెలిపారు. అయితే అరెస్ట్‌కు కేవలం రెండు రోజుల ముందు భిల్వారాలోని తన ఇంటికి అతడు తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఆకాష్‌ నిర్వహిస్తున్న ‘పేపర్ మాఫియా’ టెలిగ్రామ్ ఛానల్‌లో 52 మంది సభ్యులు ఉన్నారని పోలీస్‌ అధికారి తెలిపారు. 

వీరిలో ఎంత మంది ఫేక్‌ నీట్‌ రీటెస్ట్‌ పేపర్లు కొనుగోలు చేశారు? ఈ మోసంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే పేపర్‌ లీక్‌తో రద్దైన నీట్‌ పరీక్షను జూన్‌ 21న తిరిగి నిర్వహిస్తున్న తరుణంలో నీట్‌ రీటెస్ట్‌ ఫేక్‌ పేపర్లు అమ్మకాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది.