నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌కి ముందు పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కేంద్రం టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా టెలిగ్రామ్‌కు ఎదురుదెబ్బే తగిలింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు చెప్పింది. టెలిగ్రామ్ యాప్ కేసులో జస్టిస్ తేజస్ కరియా తన తీర్పును శుక్రవారం వెలువరించారు. సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను బ్యాన్ చేసిందని, ఆ యాప్‌ను బ్యాన్ చేయడానికి గల కారణాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ప్రభుత్వం రక్షణాత్మక చర్యలు తీసుకున్నదని, కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అసమతుల్యంగా ఉన్నట్లు భావించలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.
తాత్కాలిక బ్యాన్ కోసం ప్రభుత్వం సమర్పించిన కారణాలు సరిపోతాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ యాప్‌పై బ్యాన్ తప్పదని, ఐటీ చట్టంలోని 69ఏ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం యాప్‌ను బ్లాక్ చేసిందని కోర్టు పేర్కొన్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించేందుకు అన్ని కారణాలు ఉన్నాయని జస్టిస్ తేజస్ తెలిపారు. కేంద్రం అనాలోచితంగా ఆదేశాలు ఇవ్వలేదని, ఐటీ చట్టం ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది.
ప్రశ్నాపత్రాల పేపర్లను లీకేజ్ చేసి కొన్ని ముఠాలు చీటింగ్‌కు పాల్పడుతున్నాయని, కొందరు ఆ పేపర్లను టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా షేర్ చేసుకున్నట్లు కోర్టు చెప్పింది. దేశంలో ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు స్వేచ్ఛగా ఆపరేట్ చేస్తుండగా, కేవలం తమపై ఎందుకు బ్యాన్ విధించారని టెలిగ్రాం యాప్ కేంద్ర ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. జూన్ 21వ తేదీన నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.
టెలిగ్రామ్ తరఫు న్యాయవాదులు కొందరు వినియోగదారుల తప్పిదాల కోసం మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సరైనది కాదని వాదించారు. తక్కువ పరిమితులు ఉన్న ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చని, ఈ నిషేధం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని వాదించారు. అయితే, కోర్టు ఈ వాదనలను అంగీకరించలేదు. కేంద్రం తీసుకున్న చర్యలు కూడా పరిమితులతోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనర్ తుషార్ మెహతా వాదిస్తూ టెలిగ్రామ్ మోసగాళ్లకు ప్రధాన సాధనంగా మారిందని లేవనెత్తారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షను రాయనున్నారని, దాంతో తప్పిదాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని కోర్టుకు తెలిపారు.

More Stories
ఈ నెలాఖరు లోగా ఈపీఎఫ్ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం
బ్రహ్మోస్ క్షీపణుల కొనుగోలు పట్ల రష్యా ఆసక్తి?
సైబర్ నేరాలకు వేదికగా మారిన టెలిగ్రామ్