దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్రిటన్ నిషేధం విధించింది. పిల్లల సంరక్షణ కోసం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటించారు. ఇలా పిల్లల సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా దేశాల తర్వాత నాలుగో దేశంగా ఇప్పుడు బ్రిటన్ నిలిచింది
లండన్‌లోని ప్రధానమంత్రి అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన స్టార్మర్, ఇది ప్రధానమంత్రిగా మాత్రమే కాకుండా ఇద్దరు చిన్న పిల్లల తండ్రిగా కూడా తాను తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయమని చెప్పారు. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత, కుటుంబ జీవనంపై సోషల్ మీడియా వ్యసనం వంటివి దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
తాము నిషేధం విధించడం వల్ల టెక్ కంపెనీలు, విమర్శల నుంచి వచ్చే ఒత్తిడులకు తలొగ్గి, ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“సమస్యను నియంత్రించడం తమ పరిధిలో లేదనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదు. మాకు ఓ వ్యవస్థ ఉంది. మేం వాటిని మార్చగలం. సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల జీవితాలపై సోషల్ మీడియా దుష్ప్రభావం చూపిస్తోంది. ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు అభివృద్ధి ఆగిపోతోంది. ఎక్కువగా సోషల్ మీడియా వాడటం వల్ల పిల్లల ఎదుగుదలకు అత్యవసరమైన చదువు, ఆటలు, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సమయం గడపడం వంటివి కుదరడం లేదు’’ అని స్టార్మర్ వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయం తీసుకునే ముందు వేలాది మంది తల్లిదండ్రులతో ప్రభుత్వం విస్తృతంగా సంప్రదింపులు జరిపిందని కీర్ స్టార్మర్ తెలిపారు. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, నిపుణులు, బాలల హక్కుల కార్యకర్తల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు. ముఖ్యంగా టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల వల్ల పిల్లలు ప్రతికూల కంటెంట్‌కు గురవుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు
ఈ నిషేధాన్ని అమలు చేయడానికి అవసరమైన చట్టపరమైన అధికారాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. వచ్చే ఏడాది వసంతకాలం నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సోషల్ మీడియా పిల్లల ఆనందాన్ని దెబ్బతీస్తోందని స్టార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు, దుర్వినియోగం పెరగడానికి సోషల్ మీడియా వేదికలు కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
అలాగే పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదకర కంటెంట్‌ను ఈ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి తెస్తున్నాయని పేర్కొన్నారు. వినియోగదారులను ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేందుకు రూపొందించిన అంతులేని స్క్రోలింగ్ వంటి ఫీచర్లు పిల్లలను వ్యసనానికి గురిచేస్తున్నాయని విమర్శించారు.
సోషల్ మీడియా వినియోగం వల్ల పిల్లలు చదువుపై దృష్టి కోల్పోతున్నారని పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం, బయట స్నేహితులతో ఆడుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు తగ్గిపోతున్నాయని చెప్పారు. సాంకేతికత పిల్లల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది వారి అభివృద్ధికి ఆటంకం కలిగించే స్థాయికి చేరకూడదని స్పష్టం చేశారు.
ప్రతిపాదిత నిషేధంలో అన్ని డిజిటల్ సేవలు ఉండవు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే గేమింగ్ సేవలు, లైవ్ స్ట్రీమింగ్ వేదికలు, అపరిచిత వ్యక్తులు పిల్లలతో నేరుగా సంప్రదించగలిగే ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన పరిమితులు విధించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వయో నిర్ధారణ వ్యవస్థను రూపొందించే పనులు జరుగుతున్నాయి.
More Stories
ఒకేసారి వార్తల్లో రెబెల్ టిఎంసి ఎంపీలు విలీనమైన ఎన్సీపీఐ!
శాంతి ఒప్పందానికి ముప్పు తెస్తున్న 300 బిలియన్ డాలర్ల ప్యాకేజి
ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌరపురస్కారం