భారతీయుల డేటా చోరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

భారతీయుల డేటా చోరీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
విదేశీ సర్వర్లలో నిల్వ ఉన్న భారతీయుల వ్యక్తిగత డేటా రక్షణ, సైబర్ నేరాల నివారణపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. చోరీకి గురై విదేశీ సర్వర్లలో దాగి ఉన్న భారతీయుల డేటాను తిరిగి రికవరీ చేయడానికి లేదా పూర్తిగా నాశనం చేయడానికి ఒక బలమైన వ్యవస్థను రూపొందించాలని కోరుతూ దాఖలైన పిల్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిశీలనలోనికి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పాంచోలిలతో కూడిన ధర్మాసనం సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ నితీష్ కుమార్ దాఖలు చేసిన ఈ ప్రజాహిత పిటిషన్‌ను విచారించింది. అయితే, ఈ పిటిషన్‌పై నేరుగా న్యాయపరమైన జోక్యం చేసుకోవడానికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఇందుకు గల కారణాలను కోర్టు స్పష్టం చేసింది:

ఈ సమస్య పూర్తిగా సమాచార సాంకేతికత, అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్నదని, దీనికి న్యాయపరమైన పరిష్కారాల కంటే పరిపాలనా, సాంకేతిక నిపుణుల వ్యూహాలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. “ఈ అంశం అత్యంత సాంకేతిక స్వభావం కలది కాబట్టి, ఐటీ మంత్రిత్వ శాఖను ఆశ్రయించడమే సరైన మార్గం. ఈ పిటిషన్‌ను ప్రభుత్వానికి అదనపు వినతిపత్రంగా అందించండి. వారు దీనిని పరిశీలిస్తారు” అని ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

కన్సల్టెంట్ నితీష్ కుమార్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, విదేశీ సర్వర్లలో ఉన్న భారతీయుల డేటా ఏ విధంగా దేశ భద్రతకు, పౌరులకు ముప్పుగా మారిందో వివరించారు.  కనీసం ఐదు విదేశీ దేశాలకు చెందిన సంస్థలు భారతీయుల నుండి దొంగిలించిన డేటాను అస్త్రంగా వాడుకుంటున్నాయని తెలిపారు. పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత గుర్తింపు కార్డుల సమాచారాన్ని ఉపయోగించి అంతర్జాతీయ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ డేటా లీకేజీల వల్లే దేశంలో ‘డిజిటల్ అరెస్టులు’ బెదిరింపులు, దోపిడీలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. “మనం ఆ డేటాను తిరిగి తీసుకురాలేకపోయినా, కనీసం మన వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించి భవిష్యత్తు డేటానైనా కాపాడుకోవచ్చు” అని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ఆయా దేశాలతో “నేరస్థుల అప్పగింత ఒప్పందం”  ఉంటే తప్ప, విదేశాల్లో ఉన్న నిందితులను ఇక్కడి చట్టాల ముందుకు తీసుకురావడం అంత సులువు కాదని గుర్తుచేసింది. 

2023లో తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (దోపిడీపి) చట్టాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలని నితీష్ కుమార్ కోరారు. డేటా చోరీ, అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని,  విదేశీ అధికార పరిధిలో ఉన్న దొంగిలించిన డేటాను రికవరీ చేయడానికి లేదా దుర్వినియోగం కాకుండా నాశనం చేయడానికి కేంద్రాన్ని ఆదేశించాలని కూడా కోరారు. 

భవిష్యత్తులో డేటా రక్షణ కోసం, దొంగిలించిన డేటా దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి సమగ్రమైన యంత్రాంగాన్ని ఎలా తీసుకురావచ్చనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించే స్వేచ్ఛను సుప్రీంకోర్టు పిటిషనర్‌కు కల్పించింది.