పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ హయాంలో జరిగిన ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తప్పుదోవపట్టించడం వంటివి చేసినందుకు ముగ్గురు పోలీసు అధికారులపై ముఖ్యమంత్రి సువేందు అధికారి వేటు వేశారు. ఆ ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు. వినీత్ గోయల్ (కోల్‌కతా పోలీస్ కమిషనర్)తోపాటు అభిషేక్ గుప్తా, ఇందిరా ముఖోపాధ్యాయ్ అనే ముగ్గురిని సస్పెండ్ చేశారు. బాధితురాలి తల్లికి ఈ పోలీసులు లంచం ఇవ్వజూపారని, అలాగే వారి అనుమతి లేకుండానే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆగష్టు, 2024లో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల యువ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. దీంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. డాక్టర్లు, విద్యార్థులు, ప్రజలు ఆందోళన నిర్వహించారు. నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ, ఈ కేసు విషయంలో అప్పటి మమత సర్కార్ సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శ ఉంది.
ఆధారాల్ని మాయం చేయడం, పోలీసులు ఆలస్యంగా స్పందించడం, నిర్లక్ష్యం వంటి కారణంగా బాధిత కుటుంబానిక సరైన న్యాయం జరగలేదనే ప్రచారం ఉంది. తీవ్ర విమర్శలు, ఆరోపణల తర్వాత ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది అప్పటి ప్రభుత్వం. ఈ అంశం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కీలకంగా మారింది. మమత ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
అలాగే, మృతురాలి తల్లిని బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేయించగా, ఆమె 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి తెరమీదకు వచ్చింది.

More Stories
అమెరికన్లను నమ్మలేం.. శాంతి కోసం భారత్ కీలక పాత్ర పోషించాలి
నీట్ లీకేజీ సూత్రధారి కులకర్ణి పుణేలో అరెస్ట్
ఢిల్లీ న్యాయవాదుల డిగ్రీలను సీబీఐ నిర్ధారించాలి!