మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల కాంప్లెక్స్ హిందూ ఆలయానికే చెందుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రాన్ని ఆదేశించింది. భక్తులకు తగిన వసతులు కల్పించాలని సూచించింది. భోజ్‌శాల కాంప్లెక్స్‌ను స్వాధీనం చేసుకోవాలని పురావస్తు శాఖను ధర్మాసనం ఆదేశించింది.
ఈ చారిత్రక కట్టడం పరిరక్షణ, భద్రత, మతపరమైన ఆచారాల నియంత్రణకు సంబంధించి పురావస్తు శాఖకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. పురాతన స్మారక చిహ్నాలు లేదా కట్టడాలు, పురావస్తు, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు మాత్రమే కాకుండా, అన్ని రకాల మతపరమైన ప్రదేశాలను పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ రాజ్యాంగ బాధ్యత అని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది.
యాత్రికులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం, కొన్ని ప్రదేశాలలో సరైన ఏర్పాట్లు చేయడం, శాంతిభద్రతలను కాపాడటం కూడా రాజ్యాంగ విధి అని హైకోర్టు తెలిపింది. అంతేకాకుండా, పవిత్రతను కాపాడటం, దైవ స్వరూపాన్ని పరిరక్షించడం కూడా అత్యవసరం అని స్పష్టం చేసింది. 1958నాటి ఏఎస్‌ఐ చట్టం ప్రకారం, ఈ ఆస్తుల బాధ్యతలను ఏఎస్‌ఐ నిర్వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది.
భోజ్‌శాల ఆలయ వ్యవహారాలు, పరిపాలనపై కేంద్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. భవిష్యత్తులో ఈ కట్టడం చారిత్రక నేపథ్యం దెబ్బతినకుండా ఏఎస్‌ఐ పర్యవేక్షణలో నిర్వహణ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలు ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పురావస్తు శాఖ ఇటీవల సమర్పించిన 2వేల పేజీల శాస్త్రీయ సర్వే నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మసీదు నిర్మాణం కంటే ముందే అక్కడ పర్మార్ రాజులకాలంనాటి ఆలయం ఉండేదని, పాత ఆలయ భాగాలతోనే మసీదు నిర్మించారని పురావస్తు శాఖ నివేదికలో పేర్కొంది. ఈ ఆధారాలనే ధర్మాసనం ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ధార్ జిల్లాలో భారత పురావస్తు శాఖ సంరక్షిత కట్టడం మతపరమైన స్వభావానికి ఈ వివాదం సంబంధించినది. హిందూ సమాజం భోజ్‌శాలను వాగ్దేవి (సరస్వతీ దేవి)కి అంకితం చేసిన ఆలయంగా భావిస్తుండగా, ముస్లిం వర్గం ఆ కట్టడాన్ని కమల్ మౌలా మసీదు అని పిలుస్తుంది.
జైన సమాజానికి చెందిన ఒక పిటిషనర్, వివాదాస్పదమైన ఈ సముదాయం ఒక మధ్యయుగపు జైన దేవాలయం, గురుకులమని వాదిస్తున్నారు. భోజ్‌శాల సముదాయంపై వివాదం చెలరేగిన తర్వాత, ఏప్రిల్ 7, 2003న, హిందువులు ప్రతి మంగళవారం ఆ సముదాయంలో పూజలు చేసుకోవడానికి, ముస్లింలు ప్రతి శుక్రవారం అక్కడ నమాజ్ చేసుకోవడానికి అనుమతిస్తూ ఏఎస్ఐ ఒక ఉత్తర్వు జారీ చేసింది.
హిందూ వర్గం ఆ సముదాయంలో పూజలు చేసుకునే ప్రత్యేక హక్కులు తమకే కావాలని కోరుతూ హైకోర్టులో ఈ ఉత్తర్వును సవాలు చేసింది. హిందూవుల పక్షం వాదిస్తూ, భోజ్‌శాలను రాజు భోజుని ఆలయంగా న్యాయస్థానం గుర్తించిందని న్యాయవాది విష్ణు శంకర్ తెలిపారు. తమకు పూజలు చేసుకునే హక్కును న్యాయస్థానం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. “ముస్లిం పక్షం వారు ఒక ప్రత్యేక స్థలాన్ని కోరవచ్చు, అలాగే ప్రత్యామ్నాయ స్థలం కోసం వారు పిటిషన్ దాఖలు చేయవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ధార్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

More Stories
వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నీట్
`సనాతన ధర్మ నిర్మూలన’ పిలుపుపై తమిళనాడు హిందువులు స్పందించరే?
సంక్షోభాల నివారణలో స్థిరత్వాన్ని అందించే బ్రిక్స్ కూటమి