16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్‌’ మూడో దశ

16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్‌’ మూడో దశ

దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక విస్తృత సవరణ’ (సర్‌) మూడవ దశను ప్రారంభించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది.  మే 30 నుంచి అక్టోబర్ 14 వరకు ‘సర్‌’ మూడో దశ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. జూలై 5 నుంచి అక్టోబర్ 21 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.

హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌, లడఖ్ మినహా దేశం మొత్తం ‘సర్‌’ పరిధిలోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరాఖండ్‌, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు, దేశ రాజధాని ఢిల్లీ, చండీగఢ్, దాద్రా- నగర్ హవేలి- దమన్-దియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడో దశ ‘సర్‌’ ప్రక్రియ నిర్వహించనున్నారు.

కాగా, ‘సర్‌’ మూడో దశలో భాగంగా 3.94 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు), జనాభా గణనకు రాజకీయ పార్టీలు నియమించిన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏల) సహాయంతో ఇంటింటికి వెళ్లి 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలు తనిఖీ చేస్తారని ఈసీ తెలిపింది.

అయితే, తమ ఓటును కోల్పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్‌దేనని ఈసీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో జూన్‌ 5 నుంచి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత జూన్ 15 నుంచి జులై 14 వరకు వారు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు. అనంతరం జులై 21న ముసాయిదా జాబితా వెల్లడించారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించి, మార్పులు చేర్పుల అనంతరం సెప్టెంబర్‌ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.

ఇక, తెలంగాణలో జూన్‌ 15 నుంచి 24 వరకు శిక్షణ, జూన్‌ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి.. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్‌ 1న తుది జాబితా ప్రకటించనున్నారు. ప్రస్తుత జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఫేజ్-3 షెడ్యూల్ ఖరారు చేసింది. 

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వాతావర పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ బూత్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎస్ఐఆర్  షెడ్యూల్ వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పింది.