* 7,500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ .. 10 మందిపై ఆరోపణలు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది సంభవించిన ఆ భీకర బాంబు పేలుడు కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు- 7,500 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం సమర్పించింది. ఈ ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు(మృతి) సహా 10 మందికి అల్‌ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. సాంకేతిక, ఫోరెన్సిక్ దర్యాప్తు ద్వారా భారీ జిహాదీ కుట్రను ఛేదించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. కొందరు వైద్య వృత్తిలో ఉన్న నిందితులు కూడా ఏక్యూఐఎస్/ఏజీయూహెచ్ సిద్ధాంతాలకు ప్రభావితమై ఈ దాడికి పాల్పడ్డారని తెలిపింది.
జమ్ముకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ ప్రాంతాల్లో విస్తృతంగా దర్యాప్తు నిర్వహించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది.
588మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కుపైగా పత్రాలు, 200కుపైగా సాక్ష్యాలు సేకరించినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ హై-ఇంటెన్సిటీ వాహన ఆధారిత ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (వీబీఐఈడీ) పేలుడుతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్ నబీ (మృతి) సహా మొత్తం 10 మంది 2018లో కేంద్రం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించిన అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) అనుబంధ సంస్థ అన్‌సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (ఏజీయూహెచ్)తో సంబంధాలు కలిగి ఉన్నారు.
2022లో శ్రీనగర్‌లో జరిగిన రహస్య సమావేశంలో తుర్కియే మార్గంగా ఆఫ్గానిస్థాన్‌కు వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత నిందితులు ఏజీయూహెచ్ ఇంటిరిమ్ పేరిట సంస్థను పునర్వ్యవస్థీకరించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన భారత ప్రభుత్వాన్ని కూల్చివేసి షరియా పాలనను అమలు చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ హెవెన్లీ హింద్ ప్రారంభించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా కొత్త సభ్యులను చేర్చుకోవడం, జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేయడం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడం, మార్కెట్లో లభించే రసాయనాలతో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వివిధ రకాల ఐఈడీలను తయారు చేసి పరీక్షించినట్లు కూడా ఎన్‌ఐఏ వెల్లడించింది. పేలుడులో ఉపయోగించిన ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ) పేలుడు పదార్థాన్ని నిందితులే రహస్యంగా రసాయనాలు సమకూర్చుకుని తయారు చేసినట్లు తెలిపింది.
జమ్ముకశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు రాకెట్, డ్రోన్‌లకు అమర్చే ఐఈడీలపై కూడా ప్రయోగాలు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎన్‌ఐఏ, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది.
More Stories
యూపీలో పెనుగాలుల బీభత్సం, అకాల వర్షాలతో 117 మంది మృతి
పశ్చిమ బెంగాల్లో జంతు వధపై కఠిన నిబంధనలు
16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సర్’ మూడో దశ