హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.  కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై 2022లో బిజెపి ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఉపసంహరించుకుంది. బుధవారం  జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ మేరకు కొత్త ఉత్తర్వులను ప్రకటించారు.
 
స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ అమలుపై నూతన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.  దీని ద్వారా విద్యాసంస్థల్లో ఇటు క్రమశిక్షణ, అటు రాజ్యాంగం కల్పించిన విద్యాహక్కును సమతుల్యం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాల్సిందే. 
 
దీంతోపాటు పరిమితంగా మతపరమైన, సాంప్రదాయబద్ధమైన డ్రెస్సులు, మాలలు వంటి వాటిని ధరించేందుకు అనుమతింంచింది.  దీని ప్రకారం విద్యార్థులు టర్బన్స్, తలపాగాలు, హిజాబ్, రుద్రాక్షలు, శివధార మాలలు వంటివి ధరించవచ్చు. అలాగే, యూనిఫాం కూడా ఉండాల్సిందే. అలాగే, వీటిని ధరించారనే కారణంతో విద్యాసంస్థల్లోకి, తరగతి గదిలోకి ఎవరికీ అనుమతి నిరాకరించకూడదు. 
 
అలాగే, వీటిని యూనిఫాంలకు బదులుగా కూడా భావించకూడదు. అలాగే, ఇవేవీ క్రమశిక్షణ, గుర్తింపు, భద్రత విషయంలో రాజీపడేలా ఉండకూడదు.  ఇదే సమయంలో విద్యార్థులు ఇలాంటి మతపరమైన వాటిని ధరించేలా బలవంతం చేయకూడదు. 1983, కర్ణాటక విద్యా చట్టం ప్రకారం విద్యాసంస్థల్లో క్రమశిక్షణ తగ్గకూడదు.  2022లో ఉడిపిలోని ఒక కళాశాలలో ప్రారంభమైన ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వం హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ నిషేధాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.