పశ్చిమ బెంగాల్‌లో జంతు వధపై కఠిన నిబంధనలు

పశ్చిమ బెంగాల్‌లో జంతు వధపై కఠిన నిబంధనలు
పశ్చిమ బెంగాల్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జంతు వధకు సంబంధించిన కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గోవులు, ఎద్దులు, గేదెలు, దూడల వధపై ఆంక్షలను విధిస్తూ సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై ఏ జంతువునైనా వధించాలంటే ప్రభుత్వ వెటర్నరీ సర్జన్, స్థానిక అధికారుల నుంచి ముందస్తుగా ‘ఫిట్‌నెస్ సర్టిఫికేట్’ పొందడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం ఆవులు, ఎద్దులు, కోడెలు, దూడలు, గేదెలు (ఆడ, మగ), దూడలను వధించాలంటే నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి. జంతువు వయస్సు తప్పనిసరిగా 14 ఏళ్లు దాటి ఉండాలి. ఆ జంతువు వ్యవసాయ పనులకు గానీ సంతానోత్పత్తికి గానీ ఏమాత్రం ఉపయోగపడదని నిర్ధారణ కావాలి. 
 
ఒకవేళ జంతువుకు నయం చేయలేని వ్యాధి సోకినా, గాయాలు లేదా వైకల్యం వల్ల శాశ్వతంగా పనికిరాకుండా పోయినా మాత్రమే వధకు అనుమతినిస్తారు. 
ఈ ధృవీకరణ పత్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ లేదా పంచాయతీ సమితి సభాపతితో పాటు ప్రభుత్వ పశువైద్యుడు సంయుక్తంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనుమతి ఇస్తున్నారో కారణాలను కూడా లిఖిత పూర్వకంగా రికార్డ్ చేయాలి. 
 
ఒకవేళ అధికారులు సర్టిఫికేట్ నిరాకరిస్తే బాధితులు 15 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు.  జంతు వధ ఎక్కడ పడితే అక్కడ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారుల నుంచి అనుమతి పొందిన జంతువులను కేవలం మున్సిపల్ స్లాటర్ హౌస్‌లలో (వధశాలలు) లేదా స్థానిక యంత్రాంగం గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే వధించాలి. 
 
బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వధించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. అలాగే నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తనిఖీ చేసే అధికారులను ఎవరూ అడ్డుకోకూడదని, తనిఖీలకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఈ కొత్త నిబంధనలను అతిక్రమిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. 
 
నిబంధనలు ఉల్లంఘించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 1,000 రూపాయల జరిమానా లేదా ఈ రెండింటినీ విధించే అవకాశం ఉంది. ఈ చట్టం కింద నమోదయ్యే అన్ని నేరాలను ‘కాగ్నిజబుల్’ నేరాలుగా పరిగణిస్తారు. అంటే ముందస్తు వారెంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో జంతు సంక్షేమాన్ని పటిష్టం చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.