ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.  ఆర్టీసీలో సమ్మె ముగియడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు రోడ్డెక్కాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించారు.
 
దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, సీఎస్‌ రామకృష్ణారావు, స్పెషల్‌ సీఎస్‌ వికాస్ రాజ్‌, సందీప్ కుమార్‌ సుల్తానియా, దానకిషోర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు శుక్రవారం సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. 
 
తొలుత అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ప్రాథమికంగా చర్చించారు. తర్వాత రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చాంబర్‌లో ప్రధాన చర్చలు ప్రారంభమయ్యాయి. కార్మికులు ముందుపెట్టిన 31 డిమాండ్లలో ప్రధానమైన మూడు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఒప్పుకుంది.  ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై చర్యలు చేపడతామని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని కార్మిక నాయకులకు హామీ ఇచ్చింది. 

ఉప సంఘం పరిశీలన అనంతరం ఆర్టీసీ విలీనంపై జూన్‌ 2న ప్రకటన చేస్తామని పేర్కొంది.  యూనియన్ల పునరుద్ధరణ అంశా న్ని మ్యానిఫెస్టోలో పెట్టి ఇన్నాళ్లూ మోసగించిన ప్రభుత్వం చర్చల్లో కూడా అదే నాన్చివేత ధోరణిని అవలంబించింది.  యూనియన్ల పునరుద్ధరణపై కార్మిక సంఘాల నేతలు ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని పట్టుబట్టడంతో, దానిపై ఆర్టీసీ యాజమాన్యంతో ప్రత్యేకంగా మాట్లాడిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని పేర్కొన్నది.

అయినా, కార్మిక నేతలు ససేమిరా అని పట్టుబట్టడంతో దానిపై కూడా నిర్ణయం తీసుకొని, గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 వేతన సవరణలపై మాత్రం సుదీర్ఘంగా చర్చ జరిగింది. వారు 30 శాతం డిమాండ్‌ చేయగా 11శాతం పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్‌ సుముఖత వ్యక్తంచేసింది.

డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యతో తీవ్ర ఉద్రిక్తత 

కాగా, వరంగల్‌ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో సీనియర్‌ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించడంతో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.   హైదరాబాద్‌ కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ మృతి చెందారు.  అంతకుముందు వరంగల్‌ ఎంజీఎంలో ఐసీయూలో చికిత్స అందించిన వైద్య బృందం, ప్రత్యేక పర్యవేక్షణలో హైదరాబాద్‌కు తరలించారు. సీపీఆర్​ చేసి బాధితుడికి వెంటిలేటర్‌పై డాక్టర్లు వైద్యం అందించినా లాభం లేకుండా పోయింది. ఈ ఉదంతంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహంతో నిరసన కదం తొక్కారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడిన డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తతల అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య పూర్తయ్యాయి. తొలుత మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు, ఆయన కుటుంబ సభ్యులు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.  పోలీసులు, కార్మికులు, పార్టీల కర్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుంది. వీరికి విపక్షాలు, ప్రజాసంఘాలు మద్దతు తెలపగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు.

చివరకు కుటుంబసభ్యులు, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసుల మంతనాలు కొలిక్కి రావడంతో అంత్యక్రియలు పూర్తిచేశారు.  డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన చర్చల్లో ప్రభుత్వం తీవ్రమైన తాత్సారం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం సరిగ్గా 11 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 11.30 వరకూ కొనసాగాయి. మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ వరకూ ఉన్నతాధికారుల కమిటీ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో మంత్రుల కమిటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. 

రాత్రి శంకర్‌గౌడ్‌ అంత్యక్రియలు ముగియడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నది. ఒకవైపు కార్మిక సంఘాల నేతలను చర్చల్లో కూర్చోబెట్టి మంత్రులు, అధికారులు, తమ పనులు చేసుకుంటూ వచ్చారు. మంత్రుల కమిటీతో చర్చల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ ఆర్థికపరమైన అంశాలపై పూర్తి నిర్ణయాధికారం తీసుకొనేందుకు భట్టి విక్రమార్క అవసరం పడింది. 

ఆయన వారిని మధ్యలోనే వదిలేసి ఇతర సమావేశాలకు హాజరయ్యారు. అవి పూర్తికావడంతో మళ్లీ కార్మికులతో చర్చల్లో పాల్గొన్నారు. సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్​ శంకర్​ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్‌ గౌడ్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు.