ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి చెందిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తల వరుస అసాధారణ మరణాలు, అదృశ్యాలు కొత్త ఆందోళనలు రేకెత్తిస్తూ ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. కృత్రిమ మేధ, హైపర్‌సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతోసహా కీలకమైన సైనిక టెక్నాలజీలపై చైనా నుంచి అమెరికా వరకు పనిచేస్తున్న నిపుణులు అనుమానాస్పద లేదా వివరించలేని పరిస్థితులలో మరణించినట్లు సమాచారం.
ఈ సంఘటనలు వేర్వేరు విషాదాలా లేక ఇదొక పెద్ద సమన్వయంతో కూడిన ప్రణాళికలో భాగమా అనే దానిపై విస్తృత చర్చకు దారితీశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్‌సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతో సహా అత్యాధునిక సైనిక సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు చైనాలో మరణిస్తుండటం, అమెరికాలో అదృశ్యం అవుతూ ఉండటం కలకలం రేపుతోంది.
2022 నుంచి ఇప్పటి వరకు 11 మంది అమెరికా శాస్త్రవేత్తలు మరణించడం లేదా అదృశ్యం కావడంపై ఆ దేశ రాజకీయ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ‘విదేశీ ఆపరేషన్’ కావచ్చని రిపబ్లికన్ ప్రతినిధి ఎరిక్ బర్లిసన్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎఫ్‌బీఐ దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
మరోవైపు చైనాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. రక్షణ రంగంలో ఏఐ, హైపర్‌సోనిక్ ఆయుధాలు, అణు పరిశోధన, అంతరిక్ష రక్షణతో సహా అత్యాధునిక సైనిక సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు అనూహ్యంగా మరణిస్తున్నారు. ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్యాల వల్ల 9 మంది శాస్త్రవేత్తలు చనిపోయారు. చైనాలో మరణించిన శాస్త్రవేత్తల వయస్సు 26 నుంచి 68 సంవత్సరాల మధ్య ఉంది.
2023 జూలైలో బీజింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన 38 ఏళ్ల ప్రొఫెసర్ ఫెంగ్ యాంగ్‌హే మరణించారు. తైవాన్‌కు సంబంధించిన ఏఐ సిమ్యులేషన్‌పై ఆయన పరిశోధన చేస్తున్నారు. ‘అధికారిక విధులు నిర్వర్తిస్తూ బలిదానం పొందారు’ అని చైనా ప్రభుత్వ అనుబంధ సైన్స్ వేదిక పేర్కొనడం చర్చనీయాంశమైంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పలు కీలక రంగాలకు చెందిన చైనా శాస్త్రవేత్తలు మరణించడం మిస్టరీగా మారింది.
2018లో ఇలాంటి రోడ్డు ప్రమాదంలో మైక్రోఎలక్ట్రానిక్స్ నిపుణుడైన 57 ఏళ్ల చెన్ షుమింగ్ మరణించారు. 2023 జూలైలో జరిగిన కారు ప్రమాదంలో సైనిక ఏఐ నిపుణుడైన ఫెంగ్ యాంగ్‌హే చనిపోయారు. 2023 డిసెంబర్‌లో రసాయన శాస్త్రవేత్త అయిన జౌ గ్వాంగ్‌యువాన్ తెలియని కారణంతో మరణించారు. కాగా, 2024 మార్చిలో డేటా శాస్త్రవేత్త అయిన లియు డోంగ్‌హావో ఒక ప్రమాదం తర్వాత చనిపోయారు. 2024 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో అంతరిక్ష నిపుణురాలైన 62 ఏళ్ల జాంగ్ జియాక్సిన్ మరణించారు.
2025 జనవరిలో డ్రోన్ నిపుణుడైన 47 ఏళ్ల జాంగ్ డైబింగ్ తెలియని కారణంతో చనిపోయారు. 2025 నవంబర్‌లో బయోమెడికల్ కెమిస్ట్ అయిన లీ మిన్యాంగ్ ఆకస్మిక అనారోగ్యంతో మరణించారు. 2026 ఫిబ్రవరిలో హైపర్‌సోనిక్స్ నిపుణుడైన ఫాంగ్ డైనింగ్, వైద్యపరమైన సమస్య కారణంగా విదేశాల్లో మరణించారు. 2026 మార్చిలో హైపర్‌సోనిక్స్ పరిశోధకుడైన యాన్ హాంగ్ అనారోగ్యంతో చనిపోయారు.
ఇలా రోడ్డు ప్రమాదాలు లేదా అనారోగ్యంతో మరణించిన చైనా శాస్త్రవేత్తలలో చాలామంది వ్యూహాత్మకంగా ముఖ్యమైన సైనిక ఏఐ, హైపర్‌సోనిక్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల రంగాలలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం.
More Stories
సాఫ్ట్వేర్ రంగంలో భద్రతపై హిందూ మహిళల గర్జన
అమెరికా- ఇరాన్ చర్చల్లో ప్రశ్నార్ధకంగా పాకిస్తాన్ దౌత్యం!
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం