నేపాల్ కొత్త ప్రభుత్వం, ప్రధానమంత్రి బాలేంద్ర షా 100-పాయింట్ల సంస్కరణల ఎజెండాలో భాగంగా, దళితులకు చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు 15 రోజులలోపు ”అధికారిక ప్రభుత్వ క్షమాపణ” జారీ చేస్తుందని ప్రకటించింది. తరతరాలుగా కొనసాగుతున్న కుల ఆధారిత వివక్ష, బహిష్కరణ, అవకాశాల నిరాకరణకు ఇది ఒక చారిత్రాత్మక అంగీకారమని పలువురు అభివర్ణించారు.
అయితే ఈ క్షమాపణతో పాటు సామాజిక న్యాయం, సమ్మిళిత పునరుద్ధరణ, చారిత్రక సయోధ్యకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టాలని పలువురు కోరుతున్నారు. నేపాల్ ప్రభుత్వం విడుదల చేసిన సంస్కరణల నివేదికలో ”ప్రభుత్వ, సమాజం, విధాన నిర్మాణాల ద్వారా దళితులు, చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలపై జరిగిన అన్యాయం, వివక్ష, అవకాశాల నిరాకరణను మేము అధికారికంగా అంగీకరిస్తాము, సామాజిక న్యాయం, సమ్మిళిత పునరుద్ధరణ, చారిత్రక సయోధ్యకు పునాదిని సిద్ధం చేస్తాము.” అని పేర్కొంది.
నేపాల్ జనాభాలో దళితులు సుమారు 13-14 శాతం ఉన్నారు, అయితే రాజ్యాంగ హక్కులు ,కుల వివక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, వారు అనేక అవమానాలను, బహిష్కరణలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 42 శాతం దళితులు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని, కీలక సంస్థలలో ప్రాతినిధ్యం అసమానంగా తక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది.
బైతాడిలోని దళిత సొసైటీ డెవలప్‌మెంట్ ఫోరమ్ అధ్యక్షురాలు సరస్వతి నేపాలీ, తాను చిన్నతనంలో దళిత్ కావడంతో తన సహవిద్యార్థులతో ఒకే కుండ నుండి నీరు తాగడానికి అనుమతించలేదని, నీటి కోసం ఇంటికి నడవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ”ప్రభుత్వం అధికారిక క్షమాపణ మా గాయాలకు ఒక ఔషధం లాంటిది, కానీ అది పూర్తిగా నయం కావాలంటే, ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన అన్ని హక్కులను సమర్థవంతంగా అమలు చేయాలి. అది మాకు న్యాయం, మా గౌరవాన్ని నిర్ధారిస్తుంది.” అని ఆమె చెప్పారు.
దళిత కార్యకర్త హీరా లాల్ బిశ్వకర్మ ఈ ప్రకటనను స్వాగతించారు. అయితే దాని అర్థం అమలుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ”ప్రస్తుత నిర్ణయం గౌరవనీయమైనది, కానీ గతంలో మాదిరిగానే ఇది కేవలం మాటలకే పరిమితమవుతుందనే భయం ఉంది,” అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ”ఇటువంటి కార్యక్రమాలను ప్రకటించిన తర్వాత, విధానాలు, బడ్జెట్లు, నిర్మాణాలు అవసరం. అవి లేకుండా, ఇటువంటి ప్రకటనలతో ఉపయోగం లేదు, దీంతో దళిత సమాజానికి న్యాయం లభించదు.” అని ఆయన వ్యాఖ్యానించారు.

More Stories
అమెరికా, ఇరాన్ రెండో దశ చర్చలపై అనిశ్చితి
హోర్ముజ్‌లో భారత నౌకలపై కాల్పులు.. విచారణ చేస్తున్న ఇరాన్
7.4 తీవ్రతతో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ