హోర్ముజ్‌లో భారత నౌకలపై కాల్పులు.. విచారణ చేస్తున్న ఇరాన్

హోర్ముజ్‌లో భారత నౌకలపై కాల్పులు.. విచారణ చేస్తున్న ఇరాన్

* భారత నౌకలకు నావికాదళం అడ్వయిజరీ

హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయనే వార్తలపై ఇరాన్ స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి తెలిపారు. భారత నౌకలపై కాల్పులు జరిపింది తమ దళాలేనా అనే అంశంపై దర్యాఫ్తు చేపట్టినట్టు తెలిపారు. కాల్పులు జరిగినట్టు ధ్రువీకరణ కాలేదని, అయితే ఆరోపణలు తీవ్రంగా ఉన్నందున వాటిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 

హోర్ముజ్ జలసంధిలో శనివారం రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీ కాల్పులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఐఆర్‌జీసీ అనుమతి లభించిన తర్వాతే ఆ రెండు నౌకలు హోర్ముజ్‌లోకి ప్రవేశించాయి. అయినప్పటికీ వాటిపై దాడి జరిగింది. ఈ ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.

‘భారత నౌకలను మా దళాలే లక్ష్యంగా చేసుకున్నాయా అనే అంశంపై సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయి’ అని ఇస్మాయిలీ బాఘేయి తెలిపారు కాగా, అమెరికాతో రెండో విడత చర్చలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదని ఆయన చెప్పారు. చర్చల విషయంలో అమెరికా సీరియస్‌గా లేదని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని తెలిపారు. 

కాగా, ఈ నేపథ్యంలో భారత జెండా కలిగిన నౌకలకు మన నౌకాదళం అడ్వయిజరీ జారీ చేసిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే హర్మూజ్‌లో ప్రయాణించాలని నేవీ పేర్కొన్నది. ఆ జలసంధిని దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించేందుకే ఈ సూచనలని తెలిపింది. లారక్‌ ద్వీపం హర్మూజ్‌కు సమీపంలో ఉంటుందని చెప్పింది  యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి 11 నౌకలు ఈ జలమార్గాన్ని దాటాయి.