భౌగోళిక రాజకీయ అస్థిరతల దృష్ట్యా పెరుగుతున్న వాణిజ్య అంతరాయాల నేపథ్యంలో, తమ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించేందుకు చర్చలు ప్రారంభించేందుకు భారత్, దక్షిణ కొరియా సోమవారం అంగీకరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం ఇరుపక్షాలు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి.
ప్రస్తుతం 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య పరిమాణాన్ని 2030 నాటికి సుమారు 50 బిలియన్ డాలర్లకు పెంచడానికి భారత్, దక్షిణ కొరియా అంగీకరించాయని అధ్యక్షుడు లీ అనంతరం మీడియా సమావేశంలో తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం గురించి మాట్లాడుతూ, సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించామని, ప్రపంచ, ప్రాంతీయ వ్యవహారాలపై అభిప్రాయాలను పంచుకున్నామని ఆయన చెప్పారు.
“భారతదేశం ‘గ్లోబల్ సౌత్’లో ఒక అగ్రగామిగా అవతరించింది. మీ ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికత సారథ్యంలో, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుంది. చిప్ తయారీ, సెమీకండక్టర్లు, సాంస్కృతిక రంగాలలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా కూడా ఒక అగ్రగామిగా ఎదిగింది,” అని దక్షిణ కొరియా అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రపంచ ఉద్రిక్తతల ఈ యుగంలో, భారత్, దక్షిణ కొరియా కలిసి శాంతి, స్థిరత్వ సందేశాన్ని అందిస్తున్నాయని చర్చల అనంతరం మోదీ తెలిపారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కలిసి పనిచేయాలని కూడా ఇరుపక్షాలు తీర్మానించాయి. “అధ్యక్షుడు లీ పర్యటన అనంతరం, మన విశ్వసనీయ సహకారాన్ని భవిష్యత్ భాగస్వామ్యంగా మార్చబోతున్నాం,” అని మోదీ చెప్పారు. 2010లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఈపీఎ) అమలులోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఊపందుకున్నాయి.
భారత్-దక్షిణ కొరియా మైత్రి ప్రపంచానికి శాంతి, స్థిరత్వ సందేశాన్ని ఇస్తుందని మోదీ తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సమగ్ర వృద్ధి కోసం ఇరు దేశాలు ఒకే విధమైన దృక్పథాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల బంధం మరింత క్రియాశీలకంగా మారిందని వివరించారు. ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ రెండు దేశాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని మోదీ స్పష్టం చేశారు.
“రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన లావాదేవీలను సులభతరం చేసేందుకు భారత్-కొరియా ఫైనాన్షియల్ ఫోరమ్‌ను ప్రారంభించాం. వ్యాపార సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఒక పారిశ్రామిక సహకార కమిటీని ఏర్పాటు చేశాం. కీలకమైన సాంకేతికత, సరఫరా గొలుసుల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఆర్థిక భద్రతా చర్చలకు శ్రీకారం చుడుతున్నాం. కొరియన్ కంపెనీలు, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భారత్‌లో ప్రవేశించడాన్ని సులభతరం చేయడానికి కొరియన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం” అని ప్రధాని మోదీ వివరించారు.

More Stories
నేతాజీని ‘జాతీయ పుత్రుడు’గా ప్రకటించలేం
బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేష్ త్రివేది?
ఏడేళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి జర్మనీ పర్యటన