నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన చారిత్రక అంశాలపై పదేపదే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్) దాఖలు కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) వల్లే భారత స్వాతంత్య్రం సాధ్యమైందని ప్రకటించాలని, ఆయనకు ‘జాతీయ పుత్రుడు’ హోదా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సోమవారం కోర్టు కొట్టివేసింది.
సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ పినాక్‌పాణి మొహంతి గతంలోనూ ఇదే తరహా పిటిషన్ దాఖలు వేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేవలం పాపులారిటీ కోసమే పిటిషనర్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు కనిపిస్తోందని, చారిత్రక వాస్తవాలను న్యాయస్థానాలు నిర్ధారించలేవని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
పిల్ అధికార పరిధిని దుర్వినియోగం చేయవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. నేతాజీ పుట్టినరోజు జనవరి 23, ఐఎన్ఏ వ్యవస్థాపక దినోత్సవం అక్టోబర్ 21 తేదీలను జాతీయ సెలవులుగా ప్రకటించాలని, కటక్‌లోని ఆయన జన్మస్థలాన్ని జాతీయ మ్యూజియంగా గుర్తించాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ మొహంతిని ‘దిద్దుకోలేని వ్యక్తి’గా అభివర్ణించిన ధర్మాసనం, కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నందుకు మందలించింది.
గతంలోనే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, “మళ్ళీ మళ్ళీ ఇలాంటి పిటిషన్లు వేస్తే సుప్రీంకోర్టులోకి మీ ప్రవేశాన్ని నిషేధిస్తాం” అని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఈ పిటిషనర్ నుండి ఎటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను స్వీకరించవద్దని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
అంతకుముందు నేతాజీ భౌతిక అవశేషాలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలని కోరుతూ మార్చి 12న దాఖలైన మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
‘ఈ అంశంపై ఇంకెన్నిసార్లు కోర్టుకు వస్తారు?’ అని అప్పుడు ప్రశ్నించిన ధర్మాసనం నేతాజీ ఏకైక చట్టబద్ధమైన వారసురాలిగా ఉన్న ఆయన కుమార్తె అనితా బోస్ నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఆమె తెరవెనుక నుంచి పోరాడలేరని వ్యాఖ్యానించింది.

More Stories
2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు భారత్- కొరియా వాణిజ్యం
బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేష్ త్రివేది?
ఏడేళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి జర్మనీ పర్యటన