మహిళలకు న్యాయం దక్కకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కైన టిఎంసి

మహిళలకు న్యాయం దక్కకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కైన టిఎంసి
లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలో, ప్రతిపక్షాలపై తన దాడిని కొనసాగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు మాట్లాడుతూ, మహిళలకు దక్కాల్సిన న్యాయం దక్కకుండా చేసేందుకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), దిగువ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు విఫలమయ్యేలా కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ధ్వజమెత్తారు. 
 
బిష్ణుపూర్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశాభివృద్ధికి, ‘వికీర్ణ భారత్’ కలను సాకారం చేసుకోవడానికి భారతదేశ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని కేంద్రం కోరుకుంటోందని, కానీ అధికారంలో ఉన్న టీఎంసీ పశ్చిమ బెంగాల్ తల్లులకు, సోదరీమణులకు ద్రోహం చేసిందని విమర్శించారు. ప్రజలను నిరంతరం దోచుకుంటున్న టీఎంసీ వల్లే పశ్చిమ బెంగాల్ మహిళలకు హక్కులు దక్కడం లేదని కూడా ఆయన ఆరోపించారు.
 
“బెంగాల్ మహిళలు 33 శాతం రిజర్వేషన్ కోరుకున్నారు. మోదీ దీనిని నెరవేర్చారు. దీనిని 2029 నుంచి అమలు చేయాలని బెంగాల్ మహిళలు ఆకాంక్షించారు. ఇందుకోసం మోదీ కూడా కృషి చేశారు. కానీ, బెంగాల్ కుమార్తెలు వారి ‘మహా జంగల్ రాజ్’ను సవాలు చేస్తున్నందున, ఎక్కువ మంది బెంగాల్ కుమార్తెలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం టీఎంసీకి ఇష్టం లేదు. అందువల్ల, టీఎంసీ కాంగ్రెస్‌తో కలిసి కుట్ర పన్ని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం ఆమోదం పొందకుండా అడ్డుకుంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పార్లమెంట్‌లో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు- 2026 ఆమోదాన్ని అడ్డుకోవడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ద్రోహం చేసిందని చెబుతూ బెంగాల్‌లో అధికారంలో ఉన్న టీఎంసీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలే శిక్షిస్తారని ప్రధాని స్పష్టం చేశారు.  మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం నిరాకరిస్తూ టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని మోదీ ఆరోపించారు.
 
చొరబాటుదారులకు లబ్ధి చేకూర్చడానికి ప్రతి చట్టాన్ని, ప్రతి నియమాన్ని టీఎంసీ ఉల్లంఘిస్తోందని, కానీ మహిళా సాధికారతను మాత్రం వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. అలాగే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడంలో టీఎంసీ నిమ్నగ్నమైందని, అది రాజ్యాంగ స్ఫూర్తి గొంతునొక్కడమేనని విమర్శించారు. 
గిరిజనుల అభ్యున్నతి కోసం బీజేపీ పని చేస్తోందని చెబుతూ తొలిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. 
 
ఈ రోజు ప్రపంచం అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవిస్తుంటే రాష్ట్రపతిని టీఎంసీ ప్రభుత్వం అవమానించిందని ప్రధాని ధ్వజమెత్తారు. “ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనకు వచ్చినప్పుడు ఎలా అవమానించారో తెలుసు. ఈ చర్య ద్వారా గిరిజన తెగల్ని కూడా ఆ పార్టీ అగౌరవపరిచింది. టీఎంసీ నిత్యం గిరిజనుల్ని అవమానిస్తూనే ఉంది” అంటూ విమర్శించారు. 
 
రాష్ట్రపతిని అవమానించడాన్ని గిరిజనులు ఎప్పటికీ మర్చిపోరని ప్రధాని హెచ్చరించారు. “గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయిస్తాం. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచితంగా డయాలసిస్ నిర్వహిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. 

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత రేషన్‌తో పాటు మాతృ శక్తి భరోసా కార్డు ద్వారా ఏటా రూ. 36,000 ఆర్థిక సహాయం అందిస్తామని మోదీ తెలిపారు. మహిళలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. మహిళల భద్రత, అభివృద్ధే బీజేపీకి అత్యంత ప్రాధాన్య అంశాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన అసోం, త్రిపుర, ఒడిశా, బిహార్‌లలోని బీజేపీ ప్రభుత్వాల పాలనలో మహిళలు పొందుతున్న ప్రయోజనాలను టీఎంసీ ప్రభుత్వ అవినీతి కారణంగా బంగాల్ మహిళలు పొందడం లేదని పేర్కొన్నారు.