తమిళనాడు, కేరళ, బంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన చేసింది. తమ దృష్టికి వచ్చిన 3 గంటల్లోగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి నకిలీ కంటెంట్‌ను రాజకీయ పార్టీలు తొలగించాలని పునరుద్ఘాటించింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మార్చి 15న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా 11వేలకుపైగా నకిలీ కంటెంట్లతో కూడిన సోషల్ మీడియా పోస్ట్‌లు, యూఆర్ఎల్లను గుర్తించి చర్యలు తీసుకున్నామని ఈసీ వెల్లడించింది.
ఆయా నకిలీ కంటెంట్లను తొలగించి, వాటిని పోస్ట్ చేసిన వారిపై పోలీసు స్టేషన్లలో ఎఫ్ఐఆర్లను నమోదు చేయించామని ఈసీ పేర్కొంది. వీటిపై బాధ్యుల నుంచి వివరణలు, ఖండనలను స్వీకరించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సోషల్ మీడియా, ఏఐ జనరేటెడ్ కంటెంట్లతో ముడిపడిన చట్టపరమైన నిబంధనలను రాజకీయ పార్టీలన్నీ తు.చ తప్పకుండా పాటించేలా ఎన్నికలు జరుగుతున్న అన్నిచోట్లా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పింది.
మార్చి 15 నుంచి ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, బంగాల్, అసోం, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చిన 3,10,393 ఫిర్యాదులను పరిష్కరించినట్లు ఈసీ తెలిపింది. వీటిలో దాదాపు 96.01 శాతం పరిష్కారాలను, ఫిర్యాదు అందిన 100 నిమిషాలలోపే సాధించామని పేర్కొంది. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సీ -విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై తమకు సమాచారాన్ని అందించారని చెప్పింది.
“రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రచార ప్రతినిధులు ఒకవేళ సోషల్ మీడియా వేదికల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను పోస్ట్ చేస్తే కచ్చితంగా దానికి ఏఐ జనరేటెడ్ లేదా సింథటిక్ కంటెంట్ లేదా డిజిటల్లీ ఎన్హ్యాన్స్డ్ లేదా ఏఐ ఆల్టర్డ్ కంటెంట్ అనే లేబుల్‌ను వినియోగించాలి. దీంతోపాటు ఆ పోస్ట్ చేస్తున్న సంస్థ వివరాలనూ బహిర్గతపర్చాలి. ఎన్నికల పారదర్శకత, ఓటర్ల విశ్వాసాన్ని పొందేందుకు ఇవన్నీ చేయాల్సిందే” అని స్పష్టం చేసింది.
“అసోం, కేరళ, బంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉండే పోస్టులను ఐటీ చట్టం కింద నోటిఫై చేయబడిన ఐటీ నోడల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. అన్ని చోట్లా పోలింగ్ తేదీలకు ముందు 48 గంటల పాటు కచ్చితంగా నిశ్శబ్ద కాలాన్ని పాటించాలి. ఈ వ్యవధిలో ఏ రూపంలోనూ అభ్యర్థులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేయకూడదు. దీన్ని మీడియా వేదికలు, టీవీ ఛానళ్లు, రేడియోలు, పత్రికలు, సోషల్ మీడియా పాటించాల్సిందే” అని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) కె.ఏ. సెంథిల్ వేలన్ను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన స్థానంలో కొత్త ఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

More Stories
శ్రీలంక అధ్యక్షుడితో ఇంధన భద్రతపై ఉపరాష్ట్రపతి చర్చలు
ఏడేళ్ల తర్వాత భారత రక్షణ మంత్రి జర్మనీ పర్యటన
2027లో జిడిపి వృద్ధి 6.8 నుంచి 7.1 శాతం..ఎస్బిఐ రీసెర్చ్